అక్కడ 'అమ్మ' బ్రాండింగ్‌.. ఇక్కడ చంద్రన్న

అక్కడ 'అమ్మ' బ్రాండింగ్‌.. ఇక్కడ చంద్రన్న

దేశరాజకీయాల్లో కాస్తంత విలక్షణంగా ఉండే రాజకీయాలున్న రాష్ట్రంగా తమిళనాడును చెబుతుంటారు. ప్రాంతీయ పార్టీల పాలనే కాదు.. ప్రతి ఐదేళ్లకోసారి మార్పు గ్యారెంటీ. ఎవరెంత బాగా చేసినా మార్పు మాత్రం పక్కా అన్నది చాలా ఎక్కువ.

ఈసారి అలాంటి పరిస్థితికి బ్రేక్‌ చేసేందుకు అన్నాడీఎంకే అధినేత్రి పురుట్చితలైవి జయలలిత విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఆమె చాలానే కసరత్తు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసు వ్యవహారాన్ని కాసేపు పక్కన పెడితే.. గతంలో పోలిస్తే.. పలు సంక్షేమపథకాల్ని అమలు చేయిస్తూ మరోసారి అధికారానికి చేరువ అయ్యేందుకు ప్రయత్నించటం తెలిసిందే.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా మారి జైలుకు వెళ్లిన ఆమె.. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం ఆమె ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ పాలనలో ఆమె ముద్ర కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమ్మ బ్రాండింగ్‌ మీద ఆమె అమలు చేసిన పలు పథకాలు సూపర్‌హిట్‌ కావటమే కాదు.. వివిధ రాష్ట్రాల వారు వచ్చి అధ్యయనం చేసి వెళుతున్న పరిస్థితి తెలిసిందే. ఈ మధ్యనే అమ్మసిమెంట్‌ అంటూ అత్యంత చౌకగా సిమెంట్‌ బస్తా అందజేసేలా ఏర్పాట్లు చేయటం తెలిసిందే.

ఇలా అమ్మ బ్రాండింగ్‌తో దూసుకెళున్న ఆమెను.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తిగా తీసుకున్నట్లున్నారు. మామూలుగా అయితే ప్రభుత్వం నిర్వహించే పథకాలకు పార్టీకి చెందిన ప్రముఖల పేరు పెట్టటం మామూలే.కానీ.. జయలలిత అందుకు భిన్నంగా తనను అందరూ అభిమానంగా పిలిచే అమ్మ పేరును ఒక బ్రాండ్‌గా మార్చేశారు.

ఇక.. తెలుగుదేశం పార్టీ సంగతే చూస్తే.. ఆ పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌.. తన హయాంలో రకరకాల తెలుగు పేర్లను పథకాలకు పెట్టేవారు. ఆయన అనంతరం ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన చంద్రబాబు మాత్రం వీలైనంతవరకూ ఎన్టీఆర్‌ పేరుతో సంక్షేమ కార్యక్రమాలు అమలు అయ్యేలా చూసేవారు. తాజాగా.. ఆయన ఎన్టీఆర్‌ పేరు స్థానే తన పేరు మీద పథకాలకు శ్రీకారం చుట్టటం విశేషంగా చెబుతున్నారు.

తమిళనాడులో అమ్మ బ్రాండ్‌కు కొత్త క్రేజ్‌ తెచ్చినట్లే.. ఏపీలో చంద్రన్న పేరుతో కొత్త బ్రాండింగ్‌కు శ్రీకారం చుట్టారు. సంక్రాంతి పండగ సందర్భంగా పేదలకు అందజేసిన నిత్యావసర వస్తువుల పాకెట్‌కు చంద్రన్న కానుక అని పేరు పెట్టటం తెలిసిందే.

ఈ ఒక్క పథకానికే కాదు.. ఏపీ సర్కారులోని పలు మంత్రిత్వ శాఖలు ఇప్పుడు చంద్రన్న పేరు మీద కార్యక్రమాలకు శ్రీకారం చుట్టటం విశేషం. నిత్యవసర వస్తువులకు సంక్రాంతికి చంద్రన్న కానుక అన్న పేరు ఖరారు చేస్తే.. మరో మంత్రి పత్తిపాటి పుల్లారావు తన శాఖకు చెందిన రెండు కార్యక్రమాలకు చంద్రన్న పేరు పెట్టటం విశేషం.

చంద్రన్న సంక్రాంతి పురస్కారం పేరిట వినూత్న రీతిలో వ్యవసాయం చేసే రైతులకు పురస్కారం ఇవ్వటమే కాదు.. చంద్రన్న వ్యవసాయ క్షేత్రం అంటూ భూసార పరీక్షా కేంద్రానికి పేరు పెడుతున్నారు. ఒక్క పత్తిపాటి పుల్లారావే కాదు.. చంద్రన్న బ్రాండింగ్‌ను ప్రమోట్‌ చేసేందుకు మరికొందరు మంత్రులు సైతం.. తమ కార్యక్రమాలకు చంద్రన్న పేరు మీద పథకాలు ఫిక్స్‌ చేయటం తెలుగుదేశంలో చోటు చేసుకున్న సరికొత్త పరిణామం. చూస్తుంటే.. తమిళనాడులో అమ్మ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేసినట్లే.. ఏపీలో చంద్రన్న బ్రాండ్‌ను పాపులర్‌ చేసే లక్ష్యంలో తమ్ముళ్లు ఉన్నట్లుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు