వరంగల్‌ కార్పొరేషన్‌పై కేసీఆర్‌ కన్ను!

వరంగల్‌ కార్పొరేషన్‌పై కేసీఆర్‌ కన్ను!

వరంగల్‌ నగరం అంటే తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ వాదానికి పురిటిగడ్డ. తెలంగాణ ఉద్యమ సమయంలో శిరమెత్తి ఉద్యమం చేసినదీ ఈ గడ్డపైనుంచే. ఇప్పుడు త్వరలో వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిస్తే.. తెలంగాణ వాదం నిలిచినట్టు! టీఆర్‌ఎస్‌ ఓడిపోతే కేసీఆర్‌ ఓడిపోయినట్లు. మిగిలిన పార్టీల గెలిస్తే టీఆర్‌ఎస్‌ పని అయిపోయినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తారు. అందుకే, ఇటు జీహెచ్‌ఎంసీ అటు వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ రెండుచోట్లా ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నారు.

ఇందులో భాగంగానే ఏకంగా నాలుగు రోజులపాటు వరంగల్‌లో మకాం వేశారు. పోలింగ్‌ బూత్‌కు తరలి వచ్చి ఓట్లు వేసే నిరుపేదలు ఎక్కువగా ఉన్న బస్తీల్లో కలియదిరిగారు. వారికి పింఛన్లు ఇచ్చారు. పింఛన్లు రాని వారికి అక్కడికక్కడే ఇప్పించారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంమీద, తమ బాగోగుల గురించి కేసీఆర్‌ చాలా బాగా పట్టించుకుంటున్నారనే అభిప్రాయాన్ని కేసీఆర్‌ కలిగించారు. అయితే, ఇక్కడ అధికారుల తప్పేమీ లేదని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే అధికారులు వ్యవహరించారని ప్రతిపక్షాలు విమర్శిస్తాయి కదా! అటువంటి విమర్శలకు ఆస్కారం లేకుండా ఉండడానికి వెంటనే మరొక ఎత్తు వేశారు రాజకీయ గండరగండడైన కేసీఆర్‌.

పోస్టింగులు ఇవ్వాల్సిన ఐఏఎస్‌ అధికారుల్లో కొందరికి పోస్టింగులు ఇచ్చారు. ఇందులోనూ వరంగల్‌కే పెద్దపీట వేశారు . జిల్లాలోని మొత్తం ముగ్గురు కీలక అధికారులను ఒక్క వేటుతో బదిలీ చేసి పారేశారు. వరంగల్‌ కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌పై బదిలీ వేటు వేశారు. వారు సమర్థంగా పని చేయలేదని, అందుకే వేటు వేశామనే సంకేతాలు ఇచ్చారు. తద్వారా, ప్రజా సమస్యలపై తాను చాలా సీరియస్‌గా ఉన్నాననే భావనను ప్రజల్లో కల్పించారు కేసీఆర్‌. అయితే, ఈ చర్యలతో ఓట్లు రాలుతాయా లేదా అనేది త్వరలో తెలిసిపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు