పొట్టుపొట్టుగా చంపేస్తాడంట

పొట్టుపొట్టుగా చంపేస్తాడంట

తాను చెప్పే ఏ మాటనైనా సరే.. సూటిగా గుండెలకు తగిలేలా.. మనసులో ముద్రించుకుపోయేలా మాట్లాడటం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అలవాటు. ఈ కారణం చేతనే.. ఆయన నోటి నుంచి ఏ విషయం మీదనైనా సరే.. వచ్చే మాటల్ని మంత్రముగ్థులై మరీ వింటారు.

తాజాగా లంచం గురించి ఆయన విస్పష్టమైన వ్యాఖ్య ఒకటి చేశారు. శివమణి టైపులో తన ఫోన్‌ నెంబర్‌ను తనకు తానే స్వయంగా వెల్లడించారు. ఎవరైనా లంచం అడిగితే.. తానిచ్చిన నెంబరు (040- 23454071)కు ఫోన్‌ చేయాలని చెప్పారు.

లంచం అడిగిన వారినే కాదు.. ఇచ్చిన వారిని సైతం పొట్టుపొట్టుగా చంపేస్తానంటూ భీకర వ్యాఖ్యనే చేశారు. లంచం ఇవ్వొద్దని.. తీసుకోవద్దని మామూలుగా చెప్పే మాటలకు తనదైన మసాలా వేసేసి.. చంపేస్తా అనే వరకూ కేసీఆర్‌ మాట్లాడటం సరికాదన్న భావన వ్యక్తమవుతోంది.

వ్యవస్థలో మార్పు కోసం ఆయన తీవ్రమైన పదజాలాన్ని వాడి ఉండొచ్చు. కానీ.. ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి పొట్టుపొట్టుగా చంపేస్తా లాంటి మాటలు అంత బాగుండవు. లంచంపై ఆయన పోరాడాలనుకుంటే.. లంచాలకు అవకాశం లేకుండా వ్యవస్థను రూపొందించాలి. అంతేకానీ.. ఢాంబికంగా మాటలు మాట్లాడినంత మాత్రాన ఎలాంటి ఫలితం ఉండదు.

మహాఅయితే.. ఒకరోజు పతాక శీర్షికల్లో సీఎం వ్యాఖ్య కనిపిస్తుందే తప్ప మరెలాంటి ఫలితం ఉండదు. లంచం మీద అంత సీరియస్‌ అవుతున్న ఆయన.. మొదట తెలంగాణరాష్ట్ర సచివాలయంలోని లంచాలపై ఓ కన్నేస్తే బాగుంటుంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. లంచాలు ఇచ్చే వారిని.. తీసుకునే వారిని పొట్టుపొట్టుగా చంపేస్తానని కేసీఆర్‌ సారు చెబుతుంటే.. మరోవైపు ఆయన క్యాబినెట్‌లోని మంత్రుల్లో ఒకరు.. రూ.200.. రూ.300 కూడా లంచమేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.

ముందు లంచాన్ని ప్రోత్సహించేలా మాట్లాడే మంత్రులపై కేసీఆర్‌ తన ప్రతాపాన్ని ప్రదర్శించి.. తర్వాత జనాల్ని అంటే బాగుంటుంది. ఎవరికైనా తప్పనిసరిస్థితుల్లో.. గత్యంతరం లేక జేబులోకి చేయి పెడతారే కానీ.. అన్ని బాగుంటే ఎవరు మాత్రం ఉచితంగా ఎందుకు డబ్బులిస్తారు చెప్పండి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు