రామోజీని ఆ మాట అనలేదంటున్న కేసీఆర్‌

రామోజీని ఆ మాట అనలేదంటున్న కేసీఆర్‌

ఎవరేమనుకుంటారన్న వెరపు అస్సలు కనిపించని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలకమైన వ్యాఖ్య ఒకటి చేశారు. రామోజీ గ్రూప్‌ అధినేత.. మీడియా మొఘల్‌గా చెప్పుకునే 'ఈనాడు' రామోజీరావుకు క్లీన్‌చిట్‌ ఇచ్చేశారు.

తెలంగాణ ఉద్యమ గడ్డగా పేర్కొనే వరంగల్‌లో రామోజీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాల్ని కేసీఆర్‌ వెల్లడించటమే కాదు.. ఇంతకాలం రామోజీ వ్యవహారం వచ్చిన ప్రతిసారీ కేసీఆర్‌ గురించి చెప్పుకునే ప్రతి అంశానికి కేసీఆర్‌ తాజా వ్యాఖ్యలతో వివరణ ఇచ్చేసినట్లుగా చెప్పొచ్చు.

లక్ష నాగళ్లతో రామోజీ ఫిలింసిటీని దున్నిస్తానంటూ కేసీఆర్‌ చేసిన తీవ్ర వ్యాఖ్య గురించి ఆయన ప్రస్తావించారు. తానెప్పుడూ అలాంటి వ్యాఖ్య చేయలేదని.. మీడియా వక్రీకరించిందని తేల్చి చెప్పారు. రామోజీరావు ప్రభుత్వం నుంచి ఒక్క ఎకరా కూడా సేకరించి ఇవ్వలేదని.. ఫిలింసిటీలోని ప్రతి అంగుళం ఆయన కొనుగోలు చేసిందేనని ముఖ్యమంత్రి వెల్లడించారు.

రామోజీ ఫిలింసిటీపై దివంగత వైస్‌ దుర్మార్గంగా దాడి చేస్తే తప్పని వ్యతిరేకించానంటూ ఇంతకాలం బయటపెట్టని ఒక కొత్త విషయాన్ని కేసీఆర్‌ వెల్లడించారు. వైఎస్‌ దృష్టి ఫిలింసిటీపై పడినప్పుడు తాను ఫిలింసిటీకి వెళ్లానని కేసీఆర్‌ గుర్తు చేశారు.

అసైన్డ్‌ భూముల గురించి రామోజీరావును తాను అడిగానని.. ఫిలింసిటీలో అసైన్డ్‌ భూములు ఏమీ లేవని చెప్పారు. తాను రామోజీ ఫిలింసిటీని దున్నుతానని ఎప్పుడూ అనలేదని.. ఆ వ్యాఖ్యలన్ని మీడియా సృష్టించుకున్నవేనని.. ఫిలింసిటీలో భూమి కబ్జా జరిగిందని తాను ఎప్పుడూ అనలేదని చెప్పేశారు. తాజా వ్యాఖ్యలతో రామోజీకి కేసీఆర్‌ క్లీన్‌చిట్‌ ఇచ్చేశారనే చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు