జగన్‌కు ఎన్ని కష్టాలురా దేవుడో

జగన్‌కు ఎన్ని కష్టాలురా దేవుడో

కష్టాలు మనిషికి కాక ఎవరికి వస్తాయి. కాకపోతే.. మామూలు వ్యక్తికి వచ్చే కష్టాలకు.. రాజకీయ నాయకులకు వచ్చే కష్టాలకు మధ్య వ్యత్యాసం కాస్త తేడా ఉంటుందనే చెప్పాలి. ఇక.. కాలం కలిసి రాకపోతే పరిస్థితి మరింత ఇబ్బంది ఖాయం.

మామూలు మనిషికి కష్టం వస్తే.. అది అతనికో.. అతని కుటుంబానికి.. అతని మీద ఆధారపడిన వారి మీద ప్రభావం చూపిస్తుంది. అదే.. కీలక రాజకీయ నేతకు కష్టం వస్తే.. దాని ప్రభావం ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ ఆ రాష్ట్ర ప్రజల మీద పక్కాగా ఉంటుంది.

తాజాగా ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వ్యవహారమే తీసుకోండి. ఆయనకు ఇప్పుడున్నన్ని కష్టాలు ఎవరికి లేవేమో. ఎప్పుడు ఉంటారో ఉండరో తెలీని అనుచర గణం. నిన్నమొన్నటివరకూ తిరుగులేని నేతగా పేరులోనే గన్‌ ఉన్న దుమ్మన్న నేతగా కీర్తించిన అనుచర వర్గం రోజురోజుకీ పలుచన అవుతున్న దుస్థితి.

మరోవైపు కోర్టు కష్టాలు.. సీబీఐ ఇబ్బందులు.. వీటితో పాటు ఆయన నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యలో ఉండే చీకాకులు. వీటన్నింటికి తోడు ఒక రాజకీయ నాయకుడికి స్వభావరీత్యా ఉండే స్వేచ్ఛ జగన్‌కు లేకపోవటంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఏపీలో అధికారపక్షంపై సైతం ఆచితూచి విమర్శలు మాత్రమే చేసే పరిస్థితి. ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తే ఏమవుతుందో అర్థం కావటం లేదు. ఎందుకంటే ఇప్పుడు న్న పరిస్థితుల్లో ఎప్పుడు ఎవరు ఏ స్విచ్‌ నొక్కితే ఏం జరుగుతుందోనన్న భయాందోళనలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు ఉన్నారని చెప్పాలి.

ఏపీ సంగతి ఇలా ఉంటే తెలంగాణ అధికారపక్షాన్ని నోరు తెరిచి ఒక్క మాట అనలేని పరిస్థితి. ఏమీ మాట్లాడకపోతేనే పార్టీని ఖాళీ చేసేస్తున్న పరిస్థితి. అలాంటది బలంగా ఉన్న తెలంగాణ అధికారపక్షాన్ని ఢీ కొడితే ఏమైనా జరగొచ్చన్న విషయం జగన్‌కు తెలియంది కాదు. ఇక.. అన్నింటికి మించి కేంద్రంలో ఉన్న మోడీ సర్కారును ఒక్క మాట కూడా అనలేని దుస్థితి.

మోడీ ఫాసిస్ట్‌ లాంటి పెద్దపెద్ద విమర్శలు తర్వాత.. ఏపీ పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాల్ని ప్రశ్నించటమే కాదు.. న్యాయబద్ధంగా విభజనలో భాగంగా ఏపీకి రావాల్సిన వాటాల కోసం డిమాండ్‌ చేయటం లేదు. నోరు తెరిచి ఏం మాట్లాడితే.. అది ఎట్లా బౌన్స్‌ అయి కేసుల రూపంలో దెబ్బ పడుతుందన్న సందేహంతో నోరు మెదపటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇన్ని కష్టాలు దేశంలోని ఏ రాజకీయ నేతకు లేవన్న మాట కూడా వినిపిస్తోంది