రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి కేసీఆర్ సర్కారు..?

కరోనా పుణ్యమా అని వ్యక్తిగతంగానే కాదు.. రాష్ట్ర ప్రభుత్వాలకు రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడిన వైనం తెలిసిందే. ఈ కారణంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్ని రాష్ట్రాలు ఎదుర్కొంటున్నాయి. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేసే సంక్షేమ పథకాలు భారీగా ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల గడిచేసరికి చెల్లించాల్సిన నిధులు పెద్ద ఎత్తున ఉంటాయి. మరోవైపు.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయ మార్గాలు తగ్గిపోవటంతో.. కొత్త దారులు వెతుక్కోవాల్సిన అవసరం ప్రభుత్వంపై పడింది. దీంతో.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రభుత్వం ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్లు చెబుతోంది.

హైదరాబాద్..వరంగల్ లాంటి నగరాలు..అన్ని జిల్లా కేంద్రాలు.. ఇతర ప్రధాన పట్టణాల్లో ప్రభుత్వమే స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి శ్రీకారం చుడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వ్యాపారంలో భాగంగా ప్రభుత్వ భూముల్ని ఇందుకు వినియోగిస్తారని చెబుతున్నారు. ఇందుకోసం.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూముల్ని గుర్తించి.. అందులో ఈ తరహా కార్యక్రమానికి అనువుగా ఉండే భూముల లెక్క తేల్చాలని చెప్పినట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి ఉన్న భూముల్ని కొందరు గుట్టుచప్పుడు కాకుండా కాజేసే ధోరణి పెరిగింది. కొందరు అధికారుల అండతో.. తమకు అనుకూలంగా భూముల్ని తమ పేరుకు మార్చేసుకుంటున్నారు. దీనిపై వివాదాలు కోర్టుల్లో ఉన్నా.. అవి ఒక పట్టాన తేలని పరిస్థితి. ఈ నేపథ్యంలో అలాంటి అవకాశం ఇవ్వకుండా.. ప్రభుత్వమే భూములు అమ్మే కార్యక్రమానికి శ్రీకారం చుడితే.. భారీ ఎత్తున ఆదాయం రావటంతో పాటు.. ఎలాంటి వివాదాలు లేని భూముల్ని సొంతం చేసుకునే అవకాశం ప్రజలకు ఉంటుందన్న మాట వినిపిస్తోంది.

గతానికి భిన్నంగా సరసమైన ధరలకు భూముల్ని అమ్మకాలకు పెట్టటం ద్వారా ప్రజల్ని పెద్ద ఎత్తున ఆకర్షించటంతో పాటు.. వేలాది కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరుతుందన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. ఈ విధానానికి అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు సానుకూలంగా ఉన్నారని.. సీఎం కేసీఆర్ ఓకే చెబితే.. ముందుకు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. టీ సర్కారు వారి స్థిరాస్తి వ్యాపారం మొత్తం కేసీఆర్ అంగీకారం మీదనే ఉన్నట్లు చెప్పాలి.