బాబుకు మరో షాక్.. ఆ తమ్ముడి తీరని కోరిక తీర్చేందుకు జగన్ రెఢీ

తిరుగులేని అధిక్యతతో దూసుకెళుతున్న ఏపీ అధికారపక్షంలోకి.. విపక్ష టీడీపీకి చెందిన తెలుగు తమ్ముళ్లు పలువురు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే క్యూలో పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఏపీలో అధికారపక్షానికి తిరుగులేని రీతిలో ప్రజాదరణ ఉండటం.. సమీప భవిష్యత్తులో బాబు కోలుకునే అవకాశం లేని నేపథ్యంలో.. ఎవరికి వారు పెట్టాబేడా సర్దుకొని పోయేందుకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న టీడీపీ నేతల్లో మాజీ మంత్రి గంటా.. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ తో పాటు మరికొందరు తెలుగు తమ్ముళ్లు సైకిల్ దిగేసి.. ఫ్యాన్ కింద సేద తీరాలన్న తపనలో ఉన్నట్లు చెబుతున్నారు. జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే.. వారంతా పార్టీ మారటం ఖాయమంటున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా కాకినాడకు చెందిన టీడీపీ నేత చెలమలశెట్టి సురేశ్ పేరు బలంగా వినిపిస్తోంది. పార్టీ మారాలన్న యోచనలో ఆయన ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఇప్పటికే మూడుసార్లు ఎంపీగా బరిలోకి దిగిన ఓడిన ఆయన.. ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ కావాలన్న ఆకాంక్షను బలంగా ఉందని చెబుతారు. అన్ని హంగులు ఉన్నా.. ప్రతిసారీ ఏదో ఒక విధంగా దెబ్బ పడే ఆయన.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా తన ఎంపీ కలను నెరవేర్చుకోవాలన్నయోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన మూడుసార్లు (2009, 2014, 2019) మూడు పార్టీల నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడారు.2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేయగా.. 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. 2019లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడారు. పార్టీ మారటం.. పోటీ చేయటం ఓటమిపాలు కావటంపై ఆయన తీవ్రమైన నిరాశలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. జగన్ నుంచి వచ్చిన పిలుపుతో ఆయన పార్టీ మారేందుకు రెఢీ అయ్యారని చెబుతున్నారు. 2022లో రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతాయని.. అప్పుడు ఎంపీగా చేస్తానన్న ముందస్తు హామీతో పార్టీ మారాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో పట్టు ఉన్నప్పటికి లక్ కుదరని నేపథ్యంలో ఆయన్ను ఎప్పటికప్పుడు బ్యాడ్ లక్ వెంటాడుతుందని చెబుతారు. ఇప్పుడు వదిలేస్తే.. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీలోకి చేరితే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో జగన్ ఆయన్ను పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు చెబుతున్నారు. కాపు నేతగా అందరికి సుపరిచితుడైన రమేశ్ పార్టీలోకి వస్తే మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో జగన్ తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు కుదిరితే.. మరోరెండు వారాల్లో ఆయన పార్టీ మారటం ఖాయమని చెబుతున్నారు.