టార్గెట్ 40 లక్షలు..

టార్గెట్ 40 లక్షలు..

టీడీపీలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. నెల రోజుల పాటు నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం సూపర్ హిట్ అవ్వడంతో ఆ పార్టీ నాయకుల ఆనందానికి పట్టపగ్గాలు లేవు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే భారీ సంఖ్యలో సభ్యత్వాలు నమోదవడంతో టీడీపీ ఫుల్ జోష్ గా ఉంది. ఇదే ఊపులో మరింత మందిని సభ్యులుగా చేర్చుకోవాలని 40 లక్షల టార్గెట్ పెట్టుకుంది.

ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో 26.30 లక్షల మంది సభ్యత్వాలు నమోదైనట్లు టీడీపీ సభ్యత్వ కమిటీ కన్వీనర్ కిమిడి కళావెంకటరావు చెప్పారు. నిజానికి నెల రోజులే ఇది చేపట్టాలని భావించినా ప్రజల నుంచి వస్తున్న అనూహ్య ఆదరణ మేరకు ఈ నెల 18 వరకు సభ్యత్వ నమోదు గడువు పొడిగించామని ఆయన చెప్పారు. గడువు పూర్తయే నాటికి 35 నుంచి 40 లక్షల మంది సభ్యులుగా చేరే అవకాశం ఉందని కళా వెంకటరావు అన్నారు.

అయితే, సభ్యత్వ నమోదు ఇంత భారీ జరగడానికి టీడీపీ యువ నేత నారా లోకేష్‌ కారణమని కళా చెబుతున్నారు. లోకేశ్ సారధ్యంలోనే రాష్ట్రంలో సభ్యత్వ నమోదులు చేపట్టామని... ఆయన సూచనలు సలహాలు, విధానాలు లాభించాయని కళా చెప్పారు. ఈసారి కార్యకర్తలకు ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నామని... వటిని చూసి ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు కూడా అసూయనపడుతున్నారని కళా చెప్పారు. ఇతర పార్టీల కార్యకర్తలు తమకు కూడా టీడీపీలో ఉన్నట్లు సదుపాయాలు కల్పించాలని తమతమ పార్టీలను డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

కాగా, టీడీపీ తమ కార్యకర్తలకు రూ.2 లక్షల రూపాయల మేర బీమా సదుపాయం, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్యం, కేశనేని ట్రావెల్స్‌లో ప్రయాణిస్తే రాయితీలు వంటి సౌకర్యాలు కల్పించింది. మరోవైపు తెలంగాణలోనూ 3 లక్షల సభ్యత్వాలు రావడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు