కాంగ్రెస్‌ సెల్ఫ్‌గోల్‌ కొట్టుకుందా?

కాంగ్రెస్‌ సెల్ఫ్‌గోల్‌ కొట్టుకుందా?

ద్రవ్య వినిమయ బిల్లుపై తమ పార్టీ సభ్యులపై విప్‌ జారీ చేసిన కాంగ్రెస్‌ పార్టీ.. చివరకు విప్‌ను వెనక్కి తీసుకోవటంతోపాటు.. తెలంగాణ అధికారపక్షం ప్రవేశ పెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుకు పూర్తిగా సమర్థిస్తున్నట్లు వెల్లడించింది.

కాంగ్రెస్‌ పార్టీతో సహా మిగిలిన విపక్షాలన్నీ కూడా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లును సమర్థిస్తున్నట్లు ప్రకటించటంతోపాటు.. ఏకగ్రీవంగా తమ ఆమోదాన్ని తెలిపారు. ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రం తమ సభ్యుడు రేవంత్‌రెడ్డిని మాట్లాడించకుండా ఉన్నందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్‌ చేసి వెళ్లిపోయారు.

ద్రవ్య వినిమయ బిల్లుపై కాంగ్రెస్‌ వ్యవహారశైలిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతమాత్రం దానికి విప్‌ జారీ చేసి.. హడావుడి చేయాల్సిన అవసరం ఏముందని.. చివరకు చేతులు ఎత్తేసినట్లుగా విప్‌ను వెనక్కి తీసుకోవటంతోపాటు.. ప్రభుత్వానికి అనుకూలంగా మద్ధతు పలకటంపై తెలంగాణ కాంగ్రెస్‌ వాదులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు.. ఇంకొందరి కాంగ్రెస్‌వాదుల వాదన మరోలా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌ విషయంలో సానుకూలంగా వ్వహరించటం మంచిదని.. ప్రభుత్వం చాలా మాటలు.. హామీలను నెరవేర్చటానికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం ఆర్నెల్లు మాత్రమే అయిన విషయాన్ని గుర్తించాలని.. బిల్లుకు వ్యతిరేకంగా వ్యవహరించటం ద్వారా.. తాము చేస్తామన్న మంచిపనులకు ప్రతిపక్షాలు మోకాలడ్డుతున్నాయన్న వాదనను అధికారపక్షం వినిపిస్తే.. ఇబ్బందికరంగా మారుతుందన్న ఉద్దేశ్యంతో వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు.

ఒకవేళ అలాంటి వ్యూహమే ఉండి ఉంటే.. విప్‌ జారీ లాంటి హడావుడి చేసే నిర్ణయాలు ప్రకటించకుండా ఉండే కాస్తన్న పరువు దక్కేదన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే సభలో సమర్థంగా అధికారపక్షాన్ని నిలదీయలేదన్న విమర్శ ఉందని.. ఇలాంటి పరిస్థితుల్లో విప్‌ను వెనక్కి తీసుకోవటం సెల్ఫ్‌గోల్‌ కొట్టుకోవటం లాంటిదేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి.. ద్రవ్య వినిమయ బిల్లు విషయంలో ప్రధానప్రతిపక్షంగా కాంగ్రెస్‌సమర్థ పాత్రను పోషించలేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరి దీనికి కాంగ్రెస్‌ నేతలు ఏం చెప్పుకుంటారో..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు