రఘువీరా నోరిప్పితే జగన్‌ కొంప కొల్లేరే!

రఘువీరా నోరిప్పితే జగన్‌ కొంప కొల్లేరే!

మాయలఫకీరు ప్రాణం సప్తసముద్రాల అవతల ఒక ద్వీపంలో మంత్రాల మర్రిచెట్టు తొర్రలో పంజరంలోని చిలుకలో ఉన్నట్లుగా .. జగన్‌ ప్రాణం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రి రఘువీరా రెడ్డి చేతిలో ఉంది. కాంగ్రెస్‌ పార్టీకి సర్వధా తాను అపరిమిత విదేయుడినని... సోనియమ్మ పట్ల తనకు పూర్తి స్థాయి భక్తి ప్రపత్తులు ఉన్నాయని చాటుకుంటూ ఉండే రఘువీరారెడ్డి ఇప్పుడు అలాంటి మాటల్లో చిత్తశుద్ధి ఎంతో నిరూపించుకోవాలి.

ఐఎంజీ భూముల వ్యవహారంలో చంద్రబాబు పై విచారణ జరగాలని, జరక్కపోతే కాంగ్రెస్‌`తెదేపా కుమ్మక్కయినట్లేనని వైకాపా కొన్ని రోజులుగా పాడిరదే పాడుతోంది. విజయలక్ష్మినుంచి ఆ పార్టీ చిల్లర నాయకుల వరకూ ప్రతి ఒక్కరూ ఇదే కీర్తన ఆలపిస్తున్నారు. ఐఎంజీకి చెందిన బిల్లీరావుతో చంద్రబాబు కు ఉన్న సంబంధాలను వాళ్లు ఫోటోల సహా పదేపదే ప్రస్తావిస్తున్నారు.

అయితే తాజాగా శుక్రవారం వైఎస్సార్‌ తో బిల్లీరావు అత్యంత సన్నిహితంగా  ఉన్న, భేటీలో పాల్గొన్న ఫోటోలను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. ఈ సమావేశం ఎక్కడ జరిగిందో తెలిస్తే మరింత నివ్వెర పోవాల్సిందే. ఆయన భక్తి పేరిట ఇజ్రాయిల్‌ టూరుకు వెళ్లినప్పుడు.. అక్కడ జరిగింది ఈ రహస్య భేటీ. మన రాష్ట్రంలో భూముల కేటాయింపులకు సంబంధించి ఇజ్రాయిల్‌లో భేటీ జరగడం ఏంటి? అదే మరి వైఎస్‌ హయాంలో సాగిన భూదందా!

అయితే మరోకీలకం ఏంటంటే.. ఈ ఫోటోలో వైఎస్‌ పక్కనే మంత్రి రఘువీరారెడ్డి కూడా ఉన్నారు. భూబేరాలకు సంబంధించి వివరాలు మాట్లాడుకునేందుకు ఈ భేటీ అని తెదేపా ఆరోపిస్తోంది ఇప్పుడు రఘువీరారెడ్డి నోరు విప్పి ఆ ఫోటోలు నిజమే అని చెబితే గనుక.. వైకాపా పరిస్థితి కుడితిలోపడ్డ ఎలుకలాగా తయారవుతందనడంలో సందేహం లేదు. అయితే రఘువీరా అపరిమిత వైఎస్‌ భక్తుడు. వైకాపాకు ఎంతమేర వ్యతిరేక స్టేట్మెంట్‌ ఇస్తాడో చెప్పలేం. ఆయన నోరు విప్పి చెప్పే లా కాంగ్రెస్‌ ఆయనపై ఒత్తిడి తీసుకురాగలిగితే మాత్రం వైకాపా ఇబ్బంది పడుతుంది. అయితే రఘువీరా నోరు విప్పుతారా లేదా అనేది కీలకం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు