మెజారిటీకి, ప్రత్యేక హోదాకి సంబంధమేంటి?

ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశం మ‌రోమారు తెర‌ మీద‌కు వ‌చ్చింది. సాక్షాత్తు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి స్వాత్రంత్య దినోత్స‌వం సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌ల ఆధారంగా ఈ కీల‌క అంశాన్ని ఏపీ ప్ర‌జ‌లు మ‌ళ్లీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా గురించి, కేంద్ర రాష్ట్ర రాజ‌కీయాల్లో ప‌రిస్థితుల గురించి సీఎం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో, ప‌క్క రాష్ట్ర ముఖ్య‌మంత్రి, జ‌గ‌న్‌తో స‌న్నిహితంగా మెలిగే తెలంగాణ సీఎం కేసీఆర్ స‌ల‌హా తీసుకోవ‌డం మంచిద‌నే మాట చెప్తున్నారు.

ఇంత‌కీ అస‌లు విష‌యం ఏంటంటే, ఏపీ సీఎం జ‌గ‌న్ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా జెండా వంద‌నం చేసిన అనంత‌రం ప్ర‌సంగిస్తూ, పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం.. ప్రత్యేక హోదాను అమలు చేయాలని గట్టిగా అడుగుతామ‌ని ప్ర‌క‌టించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం మిగతా పార్టీలపై ఆధారపడే పరిస్థితి లేదని, పూర్తి మెజారిటీతో ఉన్నందున ఇప్పటికిప్పుడు హోదా ఇచ్చే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌ని విశ్లేషించారు.

ప్ర‌త్యేక హోదా సాధన‌కు సంబంధించిన గ‌త ప‌రిణామాలు, భ‌విష్య‌త్ ఘ‌ట‌న‌లు ప‌క్క‌న‌పెట్టి కేవ‌లం ఏపీ సీఎం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల గురించి విశ్లేషించినా అవి హోదా సాధ‌న కోణంలో లేవ‌నే మాట‌ను ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌త్యేక హోదాకు సీఎం జ‌గ‌న్ చెప్పిన‌ట్లు కేవ‌లం పార్ల‌మెంటులోని మెజార్టీ, ప్ర‌భుత్వం స్థిరంగా ఉండ‌టం ప్రామాణికం కాదని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఏపీ నుంచి విడివ‌డిన ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రమే దీనికి తార్కాణ‌మ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జ‌రిగిన ఉద్య‌మం స‌మ‌యంలో కేంద్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీకి ఉన్న మ‌ద్ద‌తు ఎంత‌? ఆ పార్టీ బ‌లంతో పోలిస్తే….పోరాటంలో ముందుడి సాగిన టీఆర్ఎస్ సీట్ల సంఖ్య ఎంత‌? అనేది అత్యంత కీల‌క‌మైన అంశ‌మ‌ని ప్ర‌స్తా‌విస్తున్నారు. అస‌లు అధికార పార్టీ బ‌లాబ‌లాల గురించి ఎంత మాత్రం ఆలోచించకుండా కేవ‌లం రెండు ఎంపీ సీట్లు క‌లిగిన టీఆర్ఎస్ పార్టీతో క‌లిసి త‌మ రాష్ట్ర కాంక్ష సాధ‌న కోసం క‌దా తెలంగాణ ప్ర‌జలంతా ఉద్య‌మించి, పార్టీల‌ను క‌దిలించి రాష్ట్రం సొంత చేసు‌కుంది అంటూ విశ్లేషించారు. ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించిన టీఆర్ఎస్ పార్టీ కంటే ఏ విధంగా చూసినా వైసీపీ ప్ర‌స్తుతం బ‌లంగా ఉంది. ప్ర‌త్యేక హోదా ప‌ట్ల‌ వారికి చిత్త‌శుద్ధి ఉంటే సాధించేందుకు త‌గు ప్ర‌య‌త్నాలు చేయాలని స్ప‌ష్టం చేస్తున్నారు.