రఘవీరా అండ్‌ కో రూ.లక్ష గేమ్‌ప్లాన్‌

రఘవీరా అండ్‌ కో రూ.లక్ష గేమ్‌ప్లాన్‌

మైండ్‌కి ఐడియాలు తట్టనప్పుడు.. ఎవడో ఒకడిని చూసి ఫాలో అయిపోతే సరి. ప్రస్తుతం ఏపీ పీసీసీ చీఫ్‌ రఘవీరా అండ్‌ కో పరిస్థితి ఇంచుమించు అలానే ఉంది. రాష్ట్ర విభజన విషయంలో పార్టీ అనుసరించిన విధానం.. తమ చేతకానితనాన్ని సర్దిచెప్పుకోవటానికి వారు కిందామీదా పడుతున్నారు. పస లేని వాదనలు తెరపైకి తీసుకొచ్చి పేరు కోసం.. తాము ప్రజల కోసమే ఉన్నామన్న నమ్మకాన్ని కలిగించటానికి నానా యాతన పడుతున్నారు.

అయినప్పటికీ వారి పట్ల ప్రజల్లో ఎలాంటి స్పందనా ఉండటం లేదు. ఆ మద్య హుధూద్‌ తుఫాను బాధితులను ఆదుకునేందుకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టి అభాసుపాలు కావటం తెలిసిందే. వందంటే వంద దుప్పట్లు తీసుకురావటం.. బాధితులు వందలాదిగా రావటంతో ఆ కార్యక్రమానికి హాజరైన వారంతా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టటంతో గప్‌చుప్‌గా ఆ వేదిక నుంచి వెళ్లిపోవటం తెలిసిందే.

తుఫాను సందర్భంగా మృతి చెందిన కుటుంబాలకు సాయం చేసేందుకు.. తెలంగాణలో టీటీడీపీ అనుసరించినట్లుగా పార్టీ తరఫున బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తాజాగా ఒక కుటుంబానికి రూ.లక్ష సాయం అందించారు.

రాష్ట్ర విభజన కారణంగా దారుణంగా దెబ్బ తిన్న పార్టీ గ్రాఫ్‌ను ఒక్కసారిగి తిరిగి తెచ్చుకోవటం కష్టమైన నేపథ్యంలో.. ఇలాంటి కార్యక్రమాలతో ఒక్కొక్క మెట్టు ఎక్కాలన్నది కాంగ్రెస్‌ పార్టీ ఆలోచనగా ఉంది. గతంలో మాదిరి బాధిత కుటుంబాలకు ఉత్తుత్తి పరామర్శల కారణంగా వచ్చే ప్రయోజనం శూన్యమన్న విషయాన్ని అర్థం చేసుకున్నట్లుంది. అందుకే.. గతానికి భిన్నంగా పార్టీ తరఫున పరిహారం అందిస్తూ ప్రజల మనసుల్ని దోచుకునే వ్యూహంతో ముందుకెళుతున్నారు. రాష్ట్ర విభజనతో జనం నమ్మకం మీద కొట్టిన కాంగ్రెస్‌ పార్టీని ఏపీ ప్రజలు పరిహారం లాంటి కార్యక్రమాలకే నమ్మేస్తారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు