సారు మాట వింటే ఎవరైనా బుద్ధిమంతులే

సారు మాట వింటే ఎవరైనా బుద్ధిమంతులే

విపక్షంపై ఒంటికాలి మీద విరుచుకుపడే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌.. విపక్ష నేత జానారెడ్డిని బుద్ధిమంతుడంటూ మెచ్చుకున్నారు. కేసీఆర్‌ సారేంది.. బుద్దిమంతుడని పొగడటమేమిటన్న సందేహం అక్కర్లేదు. ఎందుకంటే.. మిగిలిన వారి మాదిరి జానారెడ్డి సాబ్‌.. సార్‌ని కడిగేయరు కదా. సంప్రదాయ రాజకీయనాయకులకు చివరి వ్యక్తిగా నిలిచే ఆయన.. మర్యాద.. గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునే ధోరణిని ప్రదర్శిస్తుంటారు.

తన అవసరానికి జానారెడ్డిసాబ్‌ని పెద్దమనిషిగా.. తేడా వచ్చినప్పుడు లైట్‌తీసుకోవటం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కొత్తేం కాదు. కానీ.. ఇలాంటి రాజకీయాల్ని జానారెడ్డి పెద్దగా పట్టించుకోరు. ఎవరినో చూసి తాను పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యవహరించే ఆయన.. అసెంబ్లీలోనూ హుందాగా ఉండేందుకే ప్రయత్నిస్తారు.

అధికారపక్షం ఎంత తప్పుడు పని చేసినా.. తమ పార్టీని ఇష్టారాజ్యంగా తిట్టేసినా.. ఇలాంటి వ్యాఖ్యలు మంచివి కావు.. శోచనీయం అని మాత్రమే అనగలిగిన జానారెడ్డి.. కేసీఆర్‌కు బుద్దిమంతుడి మాదిరిగానే కనిపిస్తారు మరి.

బుధవారం అసెంబ్లీ సమావేశాల్ని పరిశీలిస్తే.. జానారెడ్డిని కేసీఆర్‌ సారు మెచ్చుకున్నారు. అసెంబ్లీలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవటం మానేసి.. సలహాలు ఇచ్చుకోవటం మంచిదని జానారెడ్డి సూచించారు. దీనిపై స్పందించిన కేసీఆర్‌.. జానారెడ్డి వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని.. గత చరిత్రలు తవ్వుకుంటూ పోతే ఏమీ రాదన్నారు. జానారెడ్డి బుద్ధిమంతుడిగా కితాబిచ్చారు.

మరి.. విమర్శలు చేసుకుంటే సారుకు ఇబ్బంది. గతంలో చేసిన మాటలు.. ఇచ్చిన హామీల్ని పెద్దగా పట్టించుకోకుండా.. చేయాల్సిన పనుల గురించి.. సారుకలలకు సంబంధించి సలహాలు.. సూచనలు ఇస్తామంటే సారుకు మించి సంతోషపడే వారు ఎవరుంటారు మరి. అందుకేనేమో జానారెడ్డిలో మూర్తీభవించిన బుద్ధిమంతుడు కేసీఆర్‌కు కనిపించారని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English