మాట్లాడితే జాతకాలు అంటున్నాడు ఉమా!!

మాట్లాడితే జాతకాలు అంటున్నాడు ఉమా!!

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై ఎదురు దాడి చేసే లక్షణాన్ని తెలుగుదేశం పార్టీ కూడా వంటబట్టించుకుంటోంది. అసలు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఈ ఎదురు దాడి మంత్రాన్ని పఠిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ అధినేత జగన్‌పై ఇదే అస్త్రాన్ని ప్రయోగించింది. ఇప్పుడు రాజధాని భూ సమీకరణకు వ్యతిరేకంగా మాట్లాడే వారిపైనా ఎదురు దాడి చేస్తోంది. అంతేకాదు.. ఐదేళ్లు మేమే అధికారంలో ఉంటామని, మీ జాతకాలు బయటపెడతామని తమిళనాడు తరహాలో భయపెడుతోంది.

సమైక్య రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అప్పట్లో రఘువీరా రెడ్డిపై అనేక ఆరోపణలు వచ్చాయి. మేఘ మథనం ద్వారా అనేక కోట్లు మింగేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఆయన సొంత ఊళ్లోనే సొసైటీ ద్వారా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. దమ్ముంటే వాటిపై విచారణ చేసుకోవాలని రఘువీరా సవాలు విసురుతున్నాడు. ఇటువంటప్పుడు.. నిజంగా రఘువీరాపై ఆధారాలు ఉంటే వాటిని బయటపెట్టి రఘువీరాను కానీ మరొకరిపై కానీ కేసులు నమోదు చేయవచ్చు. వారికి శిక్షలు విధించేలా కూడా చేయవచ్చు. కానీ, టీడీపీ నేతలు మాత్రం అసెంబ్లీ సమావేశాల సమయంలో, తమకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఇటువంటి అస్త్రాలను బయటకు తీస్తున్నారు. భూముల సమీకరణ విషయంలో సీఎంవా? రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌వా అని రఘువీరా విమర్శించగానే మంత్రి దేవినేని ఉమా నోటికి పని చెప్పారు.

వాస్తవానికి, ఆరోపణలు వచ్చినప్పుడు ఇలా ఎదురు దాడి చేసే లక్షణాన్ని రాష్ట్రంలో రాజకీయ నాయకలకు వైఎస్‌ రాజశేఖర రెడ్డి నేర్పాడు. అంతకుముందు ఇటువంటి పరిస్థితి లేదు. కానీ, ఆ తర్వాత ప్రతి ఒక్కరూ ఇదే లక్షణాన్ని వంటబట్టించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అయినా తెలంగాణలో అయినా ఇప్పుడు ఇదే అస్త్రాన్ని వాడుతున్నారు. కానీ, ఇది ఎల్లకాలం పని చేయదు కదా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు