బాలు ప‌రిస్థితి ప‌ర్వాలేదు.. భ‌య‌ప‌డొద్దు

ఇప్పుడు భార‌తీయ సినీ సంగీత ప్రియులంద‌రిదీ ఒక‌టే కోరిక‌. గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు ఏం కాకూడ‌దు. ఆయ‌న కోలుకోవాలి. ఇంటికి తిరిగి రావాలి. సంపూర్ణ ఆరోగ్య‌వంతుడై మ‌ళ్లీ మ‌న కోసం పాట పాడాలి. దేశంలో ఎంతోమందిని బ‌లిగొని, ఎన్నో జీవితాల్ని నాశ‌నం చేసిన క‌రోనా మ‌హ‌మ్మారి బాలును కూడా సోకింది. ముందు త‌న‌కేం కాలేద‌ని.. కొన్ని రోజుల్లో డిశ్చార్జ్ అయిపోతాన‌ని బాలునే స్వ‌యంగా వీడియో సందేశం ఇవ్వ‌డంతో ఏం ప‌ర్వాలేదులే అనుకున్నారంతా. కానీ శుక్ర‌వారం సాయంత్రం వ‌చ్చిన అప్ డేట్ అంర‌దినీ క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసింది. బాలు పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెన్నైలో ఆయ‌న చికిత్స పొందుతున్న‌ ఎంజీఎం హెల్త్‌ కేర్ హాస్పిట‌ల్ ప్ర‌క‌టించింది.‌ ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

బాలు లైఫ్ స‌పోర్ట్ మీద ఉన్నార‌న్న వార్త అంద‌రినీ కుంగుబాటుకు గురి చేసింది. దీంతో ఆయ‌న కోసం అంద‌రూ ప్రార్థిస్తున్నారు. ఆయ‌న వాస్త‌వ ప‌రిస్థితి ఏంటా అని ఆందోళ‌న చెందుతున్నారు. ఐతే ఈ ఆందోళ‌న‌ను కొంత త‌గ్గిస్తూ బాలు కొడుకు ఎస్పీ చ‌ర‌ణ్ ట్విట్ట‌ర్లో ఒక మెసేజ్ పెట్టారు. బాలు ప‌రిస్థితి కొంచెం క్రిటిక‌ల్ అయిన‌ప్ప‌టికీ.. ఎంజీఎం ఆసుప‌త్రి వైద్యుల ర‌క్ష‌ణ‌లో ఆయ‌న ఉన్నార‌ని.. మ‌రీ కంగారు ప‌డాల్సిన ప‌రిస్థితి లేద‌ని.. ఆయ‌న కోలుకుని అతి త్వ‌ర‌లోనే బ‌య‌టికి వ‌స్తార‌ని ధీమా వ్య‌క్తం చేశాడు చ‌ర‌ణ్‌. బాలు ఇత‌ర‌ కుటుంబ స‌భ్యులు సైతం ఆయ‌న ప‌రిస్థితి మ‌రీ విషమంగా ఏమీ లేద‌ని త‌మ‌ను సంప్ర‌దించిన వారికి చెబుతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. మ‌రి చ‌ర‌ణ్ అంద‌రికీ ధైర్యం చెప్ప‌డానికి ఈ మాట‌ల‌న్నారా.. నిజంగా బాలు ప‌రిస్థితి ప‌ర్వాలేదా అన్న‌ది స‌మ‌యం గ‌డిచాక కానీ తెలియ‌దు. కరోనా లక్షణాలతో బాలు ఈ నెల 5న ఆస్పత్రిలో చేరారు.