వివాదంలో కొత్త సినిమా

తమ సినిమా చుట్టూ వివాదం నెలకొంటే భయపడే వాళ్లు కొంతమందైతే.. అలాంటి వివాదం కోసమే చూసేవాళ్లు ఇంకొంతమంది. సినిమాకు పబ్లిసిటీ కీలకంగా మారిపోయిన ఈ రోజుల్లో రెండో కోవకు చెందిన వాళ్లు పెరుగుతున్నారు.

ఈ రోజుల్లో నిజ జీవిత కథలతో సినిమాలు పెద్ద ఎత్తున తెరకెక్కుతున్న నేపథ్యంలో వాస్తవాల్ని కొంచెం వక్రీకరించి, లేదా ఎగ్జాజరేట్ చేసి చూపించడం కామన్. దీని మీద వివాదాలు కూడా మామూలే.

నెట్ ఫ్లిక్స్ ద్వారా రిలీజైన బాలీవుడ్ కొత్త చిత్రం ‘గుంజన్ సక్సేనా’కు కూడా ఇలాంటి వివాదం తప్పలేదు. ఇందులో గుంజన్ సక్సేనా పాత్ర చుట్టూ కొంత డ్రామా నడిపారు. ఆమె అనేక అడ్డంకుల్ని, స్త్రీల పట్ల వివక్షను అధిగమించి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్లు చూపించారు.

ఐతే గుంజన్ పాత్రను ఎలివేట్ చేసేందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ను కించపరచడం ఎంత వరకు న్యాయం అంటున్నారు అధికారులు. గుంజన్ పైలట్‌గా మారి భారత వాయుసేనలో ఉద్యోగానికి వెళ్లినపుడు.. కార్గిల్ యుద్ధంలో సేవలందించేందుకు సిద్ధమైనపుడు ఆమె మహిళ అన్న కారణంతో సహోద్యోగులు, అధికారులు చిన్న చూపు చూసినట్లు, తక్కువగా మాట్లాడినట్లు సినిమాలో చూపించారు.

దీని పట్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమా విడుదలక ముందు ఈ కథను వాస్తవ రూపంలో చూపిస్తామని నిర్మాత కరణ్ జోహార్ హామీ ఇచ్చారని.. కానీ వాస్తవంగా అలా జరగలేదని.. ఈ విషయమై కరణ్‌ను సంప్రదించినా స్పందన లేదని.. సదరు సన్నివేశాల్ని తొలగించలేదని చెబుతూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. దీనిపై కరణ్ జోహార్‌ను సోషల్ మీడియాలో విమర్శిస్తున్న వాళ్లూ లేకపోలేదు. మరి దీనిపై కరణ్ అండ్ కో ఎలా స్పందిస్తుందో చూడాలి.