ఏయ్ మిస్టర్ రెడ్డీస్… రఘురామకృష్ణరాజు వార్నింగ్

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. స్వపక్షంలోనే విపక్షంలా మారిన ఆర్ఆర్ఆర్…తనకు ప్రాణహాని ఉందంటూ ఏకంగా కేంద్ర బలగాల భద్రత కోరి సంచలనం రేపారు.

ఓ వైపు సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తూ…మరో వైపు సీఎం జగన్ మరో 30 ఏళ్లు సీఎం అంటూ పొగుడుతున్నారు. తాను రాజీనామా చేయబోనని, తాను సీఎం జగన్ బొమ్మతోపాటు తన ఇమేజ్ తోనే గెలిచానని గతంలోనే పలు మార్లు చెప్పారు రఘురామకృష్ణరాజు.

ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆర్ఆర్ఆర్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. మిస్టర్ రెడ్డీస్ అంటూ తనను బెదిరిస్తూ కాల్ చేస్తున్న వారికి ఆర్ఆర్ఆర్ వీరావేశంతో వార్నింగ్ ఇచ్చారు. తనకు ఫోన్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని, అటువంటి వారు తన ఇంటి దగ్గరకు వస్తే పారామిలటరీ వారు కాల్చిపడేస్తారని మండిపడ్డారు.

తాను జగన్ బొమ్మతోపాటు తన బొమ్మతోనే అధికారంలోకి వచ్చానని రఘురామకృష్ణరాజు అన్నారు. ఏయ్ రెడ్డీస్ మీరు అబద్ధాలాడి అధికారంలోకి వచ్చారు…అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఊరికే ఫోన్ నంబర్ ఉంది కదా అని ఫోన్ చేసి బెదిరిస్తే ఊరుకోబోనని, తాను ప్రజల మద్దతుతో నెగ్గానని రఘురామకృష్ణరాజు అన్నారు.

తనను బెదిరించిన వారి ఫోన్ నెంబర్లన్నీ తన వద్ద ఉన్నాయని, కానీ, వారి పేరు చివర రెండక్షరాల సామాజిక వర్గం వాళ్లు ఉంటే న్యాయం జరగదన్న ఉద్దేశంతో కంప్లయింట్ చేయకుండా ఆగిపోతున్నానని అన్నారు. ఇంటర్నెట్ లో ఫోన్ నెంబర్ ఉంది కదా అని ఊరికే ఫోన్ చేస్తున్నారు…నేనెందుకు రాజీనామా చేయాల్రా యూజ్ లెస్ ఫెలోస్ అటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జుట్టు గురించి కామెంట్ చేసిన వారిపై ఆర్ఆర్ఆర్ మండిపడ్డారు.

రాజధాని అమరావతి నుంచి తరలిపోవడం జరగని పని అని, రైతులకు నూటికి నూరుపాళ్లు న్యాయం జరిగి తీరుతుందని రఘురామకృష్ణరాజు అన్నారు. జగదేకవీరుని కథ సినిమాలో ఐదుగురు ఎన్టీ రామారావులు వచ్చి పాట పాడినప్పుడు కఠిన శిల కూడా కరుగుతుందని, అలాగే రాజధాని రైతుల ఆక్రందనలు జగన్ ను కరిగిస్తాయని ఆర్ఆర్ఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ జగన్ మనసు కరగకపోయినా ఈలోపే న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందని అన్నారు.