అక్కడ పవర్ స్టార్ ఆయనే..

అక్కడ పవర్ స్టార్ ఆయనే..

మహారాష్ట్రలో బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంలో ఇప్పటికీ తాము సిద్ధమేనని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ కాషాయ పార్టీకి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు. బుధవారం మహారాష్ట్ర సీఎం ఫడణవిస్ బలపరీక్ష ఎదుర్కోనుండడంతో పవార్ సహకరించడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఎదురెళ్తోంది. రాష్ట్రంలో సుస్థిర పాలన కావాలని, మరోసారి ఎన్నికలు ఎందుకు.. మద్దతు ఇస్తామంటూ సుద్దులు చెబుతోంది. నిజానికి పవర్ లేకుండా ఉండలేని పవార్ ఎవరు అధికారంలో ఉంటే వారితో కలవడమే తమ పద్ధతన్న సంగతి ప్రజలకూ తెలుసని గుర్తించలేకోతున్నారు.

శివసేన, బీజేపీల మధ్య ఏం జరుగుతుందనేది ఇంకా స్పష్టత రాకపోవడం... పెళ్లా..? పెటాకులా? అనేది అంచనాలకు అందకపోవడంతో ఫడణవిస్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు మేం రడీ అంటూ శరద్‌ పవార్‌ బీజేపీకి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.

డిప్యూటీ సీఎం పదవి.. హోం, ఫైనాన్స్ లో ఏదో ఒక మంత్రి పదవి ఇవ్వాలని శివసేన పట్టుబట్టడం.. బీజేపీ అందుకు నిరాకరించడంతో రెండు పార్టీల మధ్య ముడి బిగుసుకుంది. 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వానికి కనీసం 145 మంది మద్దతు అవసరం. బీజేపీకి 122 మంది ఎమ్మెల్యేలే ఉండడంతో... 63 మంది బలం ఉన్న శివసేన కానీ, 41 మంది ఎమ్మెల్యేలున్న ఎన్సీపీ కానీ తోడుండాలి.  శివసేన, బీజేపీలకు పొసగకపోవడంతో అదే అదనుగా ఎన్సీపీ బీజేపీ, అధికారం రెండింటికీ చేరువ కావాలని ప్రయత్నాలు చేస్తోంది.  అదే జరిగితే పవార్ మహారాష్ట్రలో పవర్ స్టారే అని చెప్పొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు