అవసరమైనవి ఆయన ఎందుకు చదవరు?

అవసరమైనవి ఆయన ఎందుకు చదవరు?

అదేం చిత్రమో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందరూ అన్ని చెబుతుంటారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రతి సమాచారం అందటం పెద్ద విషయం ఏమీ కాకున్నా.. కేసీఆర్‌ వ్యవహారంలో మాత్రం కాస్త చిత్ర విచిత్రంగా ఉంటుంది.

ఉదాహరణకు ఒక ప్రముఖ పత్రికలోని ఎడిట్‌ పేజీలో ఉత్తరాల కాలమ్‌ని చదవి సొంతంగా స్పందించి మరీ సదరు లేఖ రాసిన పాఠకుడి ఫోన్‌ నెంబరును సంపాదించి మరీ పలుకరించే సత్తా కేసీఆర్‌ సారు సొంతం. మరి.. అదే ముఖ్యమంత్రికి.. తన క్యాబినెట్‌లోని మంత్రి ఒకరు కూసింత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే.. అది మాత్రం ఆయన దృష్టికి రాదు.

చివరకు ఎవరో ఒకరు చెప్పిన మీదట.. సదరు మంత్రిని పిలిపించి వివరణ అడుగుతారే కానీ.. ఆయన మాత్రం సొంతంగా చదవరా? అన్న సందేహం రాక మానదు. తాజా అసెంబ్లీ సమావేశంలో మంత్రి పోచారం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సభకు సమాధానం చెప్పే క్రమంలో కేసీఆర్‌ కవర్‌ చేసేందుకు తెగ ప్రయత్నం చేశారనే చెప్పాలి.

తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతులు.. పలు కారణాల వల్ల చనిపోయిన వారే కానీ.. అప్పుల బాధతో.. ఆర్థిక ఇబ్బందులతో కాదన్నది ఆయన వ్యాఖ్యల సారాంశం. ఇంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన మంత్రికి సంబంధించిన న్యూస్‌క్లిప్పింగ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి చదవరా? అంటే.. చదవలేదని కేసీఆర్‌కు.. కేసీఆరే చెప్పుకున్నారు.

తనకు ఎవరో చెబితే.. మంత్రిని వివరణ కోరానని చెప్పుకున్నారు. సాధారణంగా ఏదైనా వివాదాస్పద అంశం అనుకుంటే.. అది తమ చెవిన పడిన వెంటనే దాన్ని తెప్పించుకొని ఒక్కసారి కళ్లతో చూసి కన్ఫర్మ్‌ చేసుకుంటారు. అంతేకానీ..ఎవరో చెప్పారని వారి మాటల్ని ఆధారంగా చేసుకొని వివరణ అడగరు. అలా అని ముఖ్యమంత్రి తనకు తానుగా చెబుతున్న మాటను అసెంబ్లీలో తప్పు పట్టలేరు.

ఇక్కడే పాయింట్‌ ఏమిటంటే.. ఒక ప్రముఖ దినపత్రికలో ఒక పాఠకుడు రాసిన లేఖను చదివి స్పందించిన ముఖ్యమంత్రి సారు.. తన క్యాబినెట్‌లోని మంత్రి ఒకరు అన్నదాతల ఆత్మహత్యలకు లాంటి సున్నితమైన అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని తెలిసినప్పుడు ఎందుకు చదవరు? ఏదైతే ఇబ్బంది పెట్టే అవకాశం ఉందో.. అలాంటి వాటిని కేసీఆర్‌ సారు చూస్తారే కానీ.. చదవరేమో. అదే.. ఆయనకు విపరీతమైన మైలేజీ తెచ్చే వాటిని మాత్రం ఆయన చూడటమే కాదు.. స్వయంగా ఫోన్‌ చేసి మాట్లాడతారు. రాజకీయం అంటే ఇలానే ఉంటుందేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు