రేషన్‌ ఒకలా.. పింఛను మరోలా ఎందుకు?

రేషన్‌ ఒకలా.. పింఛను మరోలా ఎందుకు?

తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద విధానం విమర్శల పాలయ్యే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం టీ సర్కారుకు ఇబ్బందిగా పరిణమించే అవకాశం ఉందని చెప్పొచ్చు.

రేషన్‌ విషయంలో కుటుంబంలోని సభ్యులందరిని పరిగణలోకి తీసుకొని బియ్యం ఇస్తామని చెప్పిన తెలంగాణ సర్కారు.. వృద్ధాప్య పింఛను విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తామని చెబుతున్నారు.

ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉన్నా.. ఒకరికి మాత్రమే పింఛను ఇస్తామని చెబుతున్నారు. ఇద్దరు ముసలివాళ్లకు ఒక్కరినే పరిగణలోకి తీసుకుంటే ఇంకొకరు ఏం పాపం చేసినట్లు? వృద్ధులు వృద్ధులే కదా? ఒకరికి ఇచ్చి.. మరొకరికి ఇవ్వకపోవటం వల్ల ఇబ్బందులు పెరగటమే కానీ తక్కువ అవ్వవు. ఉదాహరణకు ఇద్దరు వృద్ధదంపతులు ఉన్నారనుకుందాం.

వారు కొడుకు ఇంట్లో ఉన్నారనుకుందాం. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం పుణ్యమా అని భర్తకు పింఛను వచ్చి.. భార్యకు రాలేదనుకుందాం. ఇంట్లో కొడుకు.. కోడలు మామను సరిగా చూసుకొని.. అత్తను సరిగా చూసుకోకపోతే ఎవరు బాధ్యత వహిస్తారు?ఇదొక్కటే కాదు.. వృద్ధులు అన్నాక సవాలచ్చ ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వారికి ఆర్థికంగా ఎంతోకొంత చేయూత అవసరం.

ఇలాంటి సమయంలో ఇంటికి ఒకరికి మాత్రమే పింఛను  ఇస్తామని చెప్పటం ద్వారా లేని పోని లల్లికి తెలంగాణ సర్కారు అవకాశం ఇస్తుందన్న వాదన వినిపిస్తోంది. మరి.. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి. పింఛన్ల కోసం దాదాపు రూ.3వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్న టీ సర్కారు.. ఇంట్లో ఉండే ఇద్దరు వృద్ధులకు ఇస్తే మరికాస్త భారం పడుతుంది. అంతేకానీ.. ఆ పండుటాకులు అవమానాల్ని తప్పించిన వారు అవుతారు. ఈ విషయంపై కాస్తంత మానవత్వంతో ఆలోచించాల్సిన అవసరం ఉందనే చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు