టెస్టుకు వెళితే కిట్ అంటకట్టేస్తున్నారు

భయాన్ని సొమ్ము చేసుకోవటం ఒక అలవాటుగా మారితే ఎంత ప్రమాదమో.. కరోనా వేళ చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. ఇట్టే తెలుస్తోంది. అంతకంతకు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో.. కాస్త లక్షణాలు కనిపిస్తే చాలు.. ముందు వెనుకా చూసుకోకుండా టెస్టుల కోసం పరుగులు తీస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వారి కోసమే తామున్నట్లుగా ప్రైవేటు డయాగ్నిస్టిక్ సెంటర్లు వ్యవహరిస్తున్నాయి.

ప్రభుత్వం నిర్ణయించిన రేట్లను అమలు చేయకుండా.. తమకు తోచినట్లుగా వ్యవహరిస్తున్నారు. అదేమంటే.. కల్లిబుల్లిమాటలు చెబుతున్నారు. ప్రశ్నిస్తే.. మీ ఇష్టమండి.. చేయమంటే చేస్తాం.. లేదంటే లేదని చెప్పేస్తున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. టెస్టు ముఖ్యమైన నేపథ్యంలో కాదనలేక.. వారు చేసే దోపిడీకి బాధితులుగా మారిపోతున్న ఉదంతాలు హైదరాబాద్ లో అంతకంతకూ పెరుగుతున్నాయి.

కరోనా వైద్యం పేరుతో ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ గురించి కథనాలు వచ్చాయి కానీ.. టెస్టుల పేరుతో దండిగా దోచేస్తున్న వారిపైన మీడియాలో పెద్దగా కథనాలు ఫోకస్కాలేదనే చెప్పాలి. కరోనా నిర్దారణ పరీక్ష కోసం వచ్చిన వారి నుంచి రూ.2200 వసూలు చేయాలి. కానీ.. అందుకు భిన్నంగా.. శాంపిల్ సేకరించిన వ్యక్తి పీపీఈ కిట్ ధరించారంటూ.. అందుకు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.

బయట మార్కెట్లో ఈ రోజున పీపీఈ కిట్ రూ.300లకే దొరుకుతోంది. అయినప్పటికీ.. రూ.వెయ్యి చొప్పున వసూలు చేయటం గమనార్హం. కొన్నిపరీక్షా కేంద్రాల్లో అయితే.. టెస్టు కోసం వచ్చిన వారు ఎన్ 95 మాస్కు తప్పనిసరి అని చెబుతూ.. దాని కోసం అదనంగా రూ.300 వసూలు చేస్తున్నారు.

మొత్తంగా చూస్తే.. టెస్టుకు వెళ్లటం ఆలస్యం.. వీలైనంత దోచేయటమే లక్ష్యమన్నట్లుగా డయాగ్నస్టిక్ సెంటర్ల తీరు ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో మరికొన్నిడయాగ్నస్టిక్ సెంటర్లు మరో అడుగు ముందుకు వేసి.. ఏ మాత్రం లక్షణాలు కనిపించినా.. కరోనా కిట్ పేరుతో దోపిడీ చేస్తున్న వైనం వెలుగు చూసింది. లక్షణాలు పెద్దగా లేని వారికి.. ఒక మోస్తరుగా ఉన్న వారికి ఇంట్లో ఉండే చికిత్స చేయించుకోవాలని ప్రభుత్వం చెబుతోంది.

దీన్ని అసరాగా చేసుకొని.. తాము కిట్ కూడా అమ్ముతామని చెబుతూ.. రూ.13,500 వసూలు చేస్తున్నారు. ఆసుపత్రికి వెళితే లక్షల్లో ఖర్చు పెట్టే కన్నా.. వారు చెప్పినట్లే రూ.13,500 చెల్లించి కిట్ కొనుగోలు చేస్తున్నారు. కొందరు వద్దంటే.. మాటలతో భయపెట్టి మరీ అంటకడుతున్న వైనాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటివరకు ఆసుపత్రుల దోపిడీ మీద ఇప్పుడిప్పుడే ఫోకస్ చేస్తున్న ప్రభుత్వం.. ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్ల మీద కూడా కన్నేయాలని.. వారి దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

ప్రైవేటుకు కాకుండా.. ప్రభుత్వం నిర్వహించే సెంటర్లకు వెళ్లొచ్చు కదా? అన్న సందేహం రావొచ్చు. అక్కడ పెద్ద పెద్ద క్యూలు ఉండటం.. రోగ లక్షణాలు ఎక్కువగా ఉన్నోళ్లు ఉండటంతో.. అక్కడికి వెళ్లి లేనిపోని వైరస్ మూటగట్టుకోవటం ఎందుకన్న సందేహంతో.. ప్రైవేటుకు వెళితే.. వీరేమో డబ్బులు దోచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే ఇలాంటి వారికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.