‘నీక్కూడా! గన్‌మెన్‌ కావాలా బాబూ’

‘నీక్కూడా! గన్‌మెన్‌ కావాలా బాబూ’

‘బాబూ! నీక్కూడా లడ్డూ కావాలా’ అంటూ టీవీ ప్రేక్షకుల్ని బహుధా ఆకట్టుకునే మిఠాయిల ప్రకటనలు గుర్తొస్తున్నాయి. ‘బాబూ మీకూ గన్‌మెన్‌ కావాలా’ అని అడగాలని అనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యేలకు కూడా గన్‌మెన్‌లను ఇచ్చుకుంటూ వెళితే.. పోలీసు శాఖ మ్యాన్‌పవర్‌ కొరతతో చచ్చుకుంటూ ఏడవాల్సిందే. అయితే ఈ వాస్తవాన్ని గుర్తించకుండా.. తాజా మాజీలు తమకు గన్‌మెన్‌లు కావాల్సిందేనని.. మానవహక్కుల సంఘం ఎదుట ఫిర్యాదు చేయడం విచిత్రం.

కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల్లో ఉంటూ వైకాపాకు అనుకూలంగా.. అవిశ్వాసం తీర్మానం విషయంలో విప్‌ను ధిక్కరించి ఓటు వేసినందుకు గాను.. 15 మంది ఎమ్మెల్యేలు అనర్హత కత్తివేటుకు పదవుల్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారు సాధారణ వ్యక్తులు. అంతకు మించి ఘనంగా చెప్పుకోవాలంటే గనుక.. తాజా మాజీ ఎమ్మెల్యేలని చెప్పుకోవచ్చు. వారు ఎలా చెప్పుకున్నా సరే.. సాంకేతికంగా మామూలు వ్యక్తులే గనుక.. ఇన్నాళ్లూ ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పుడు వారి పరిరక్షణార్థం సమకూర్చినటువంటి గన్‌మెన్‌ సదుపాయాన్ని పోలీసు శాఖ ఉపసంహరించేసింది.

మామూలుగా ఎమ్మెల్యే అంటే.. అతనేమీ ఆకాశం నుంచి ఊడిపడినట్లు పది అడుగుల మానవాకారంలాగా ప్రత్యేకంగా ఉండడు కదా! తమ వెంట చంకలో మెషిన్‌ గన్‌ తగిలించుకున్న సఫారీ సూటులోని పోలీసు ఉంటేనే వారికి బయటకు వెళ్లినప్పుడు మర్యాద దక్కేది. వారిని చూడగానే.. అబ్బో ఎవరో ప్రముఖుడు వచ్చాడే అని .. బయటి వారంతా దండాలు దస్కాలు పెట్టి ఆదరించేది. ఇప్పుడు తమ అధికార చిహ్నంగా మారినటువంటి.. గన్‌మెన్‌లను తొలగించేసరికి.. పాపం ఈ తాజా మాజీలకు ఊపిరి ఆడడం లేదు.

తమ బ్యాగులు మోయడానికి, బజారుకు వెళ్లి తమకు టిఫిన్లు గట్రా తీసుకురావడానికి, కొండొకచో మిత్రులతో ‘రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో’ కూర్చున్నప్పుడు.. సీసాలు తెరచి గ్లాసుల్లోకి వంపడానికి సర్కారు వారి ఖర్చుతో నియమితుడై ఉన్న కూలీ వ్యక్తి ఇప్పుడు తమ వెంట లేకపోయే సరికి పాపం ఎమ్మెల్యేలు ఖిన్నులైపోతున్నట్లున్నారు. అక్కడికి ప్రభుత్వం ఒక మనిషిగా తమ హక్కులను కాలరాచినట్లు వారికి అనిపించింది. అందుకే యెకాయెకిన మానవ హక్కుల సంఘం వద్దకు వెళ్లారు.

ఇంతకూ.. అసలు గన్‌మెన్‌లను తీసుకోవడం అనేదే.. ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలోని ప్రజలందరి మనిషిలాగా కాకుండా.. ఎవరో కొందరికి శత్రువులాగా కూడా బతుకుతున్నాడని అనడానికి ప్రతీక! అక్కడే ఒక ప్రజాప్రతినిధిగా ఆ నాయకుడు ఫెయిలైనట్లు లెక్క. ఎమ్మెల్యేగా ఉంటూ కూడా తనకు గన్‌మెన్‌ అవసరం లేదని తిరస్కరించిన గౌరవ సభ్యులు మనసభలోనే ఉండడం ఒక విధమైన గర్వకారణం.

అలాంటిది వీరికి ఇప్పుడు ఎమ్మెల్యే పదవి కూడా లేదు. మరి వీరికి వెంట రక్షక భటులు ఎందుకు? ఏదో ప్రభుత్వం తమను వేధిస్తుందన్నట్లుగా ఒక డ్రామా నడిపించడానికి కాకపోతే.. మాజీలు అయిన తర్వాత కూడా గన్‌మెన్‌లకోసం నిరసనలు వెలిబుచ్చితే పోయేది తమ పరువే అని వారు తెలుసుకోవాలి.