అటు శ్రీశాంత్‌... ఇటు జగన్‌...

అటు శ్రీశాంత్‌... ఇటు జగన్‌...

ఇద్దరూ షేమ్‌ టు సేమ్‌... ఇద్దరి బయోగ్రఫీ ముడుపుల ఆరోపణలే... ఇప్పుడు ఇద్దరి పరిస్థితీ దేవుడిపై భారం వేయడమే... కాకుంటే శ్రీకి కొంత తెరపి... జైలునుండి విడుదలై... దేవుడ్ని కాకా పడుతున్నాడు... జగన్‌ మాత్రం జైల్లోనే ఉన్నాడు. అయితేనేం... ఆయన తరపున ఆయన భార్య, తల్లి, సోదరి అంతా కూడా దేవుడ్ని కాకాపట్టే పనిలో ఉన్నారుగదా...! అయితే వీరంతా ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి. దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అంటున్నారు... దేవుడు ఎవరిని కాపాడుతాడు... ఎలాంటి పరిస్థితుల్లో కాపాడుతాడు... ఎప్పుడు కాపాడుతాడు... దీనికి ఆయనకు ఏదైనా లెక్క ఉంటుందా... అంటే ఉంటుందనే చెప్పుకోవాలి... పురాణ కాలంనుండి తీసుకున్నా... దేవుడు కాపాడిరది పాపాలు చేసిన వారిని కాదు... ఒకవేళ పాపాలు చేసినా తాము చేసిన తప్పులను తెలుసుకుని పశ్చాత్తాపం చెందిన వారిని, చేసిన తప్పులకు సరిపడిన శిక్షను అనుభవించిన తర్వాత కరుణించిన ఘట్టాలు కూడా మనకు చరిత్రలో చాలానే ఉన్నాయి.

ఒకరు దేశంలో అందరూ ఇష్టపడే క్రికెట్‌ ఆడుతూ... అందరినీ ఆకట్టుకున్న తరువాత జల్సాలకు బానిసై అందుకు అవసరమైన డబ్బుకోసం ఆటను తాకట్టుపెట్టి జైలు ఊచలు లెక్కించాల్సి వచ్చింది. మరొకరు అయాచితంగా వచ్చిన అధికారాన్ని ఆదాయంగా మార్చుకుని, ఇలా అన్యాయంగా వచ్చిన సంపాదనకు లెక్కలు చూపించలేక... తాను చేసిన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి మార్గం కనిపించక దోషిగా జైలు గడప ఎక్కాల్సి వచ్చింది. ఇలా ఇద్దరూ జైలులోకి వెళ్లిన తర్వాత వారిలో పరివర్తన కలిగిందా అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. శ్రీశాంత్‌కు ఎట్టకేలకు కోర్టు బెయిలు మంజూరు చేసింది. దీంతో ఇచ్చిన కొద్ది సమయంలోనే శ్రీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని, అలాగే పనిలో పనిగా దైవారాధన బలంగా చేయాలని ప్రణాళిక వేసుకున్నాడు. ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు కదా... అలాగే ఏ దేవుడు ఎంతటి శక్తిమంతుడు అనే విషయాన్ని ఎవరూ అంచనా వేయలేరుకదా... కాబట్టే కేరళలోని శక్తిమంతమైన ఆలయాల చుట్టూ శ్రీ ప్రదక్షిణలు చేసేస్తున్నాడు. అంతేకాదు... తులాభారాలు కూడా తూగుతూ దేవుణ్ని తన శాయశక్తులా కాకా పట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు.

మరోవైపు జగన్‌ జైల్లో ఉన్నా కూడా తాము ఇలా ఉన్నాము అంటే అది దేవుని దయనే... జగన్‌ జైలులో ఉన్నా పార్టీ ఇలా ముందుకు నడుస్తోంది అన్నా... షర్మిల పాదయాత్ర సాగిస్తోందన్నా... అంతా కూడా దేవుడి దయనే అంటూ జగన్‌ సతీమణి భారతి భావాలను వ్యక్తం చేస్తోంది. ఇదంతా చూస్తుంటే... వీరు ఒకరకంగా దేవుణ్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారేమో అనిపిస్తోంది... జగన్‌ జైల్లో ఉన్నా కూడా తాను, పిల్లలు ఇలా ఉన్నామంటే దేవుడి దయే అనడం కాదు... దేవుడు అసలు జైలును జగన్‌కు ఎందుకు ఇచ్చాడు అనేది వీరంతా కొద్దిగా ఆలోచించాల్సి ఉంది. తప్పు చేశాడు కాబట్టి దేవుడు జగన్‌కు జైలునిచ్చాడు అనేది కూడా ఈ దేవుడిచ్చాడు స్తుతిలో చేర్చుకుంటే బాగుంటుందేమో... దేవుడు ఎవరు దేనికి అర్హులు అనే విషయాన్ని ఆలోచించి... తదనుగుణంగా వారికి అవి సమకూరేలా అవకాశాలను సృష్టిస్తాడు. అంతేగానీ... ఎవరికీ ఇలా చక్కగా చాపలా చుట్టచుట్టి చేతిలో పెట్టడు. ఈ విషయాన్ని శ్రీశాంత్‌, అటు జగన్‌ ఇద్దరూ గుర్తుంచుకోవాల్సి ఉంది. వీరిద్దరూ తాము ఎలాంటి తప్పులూ చేయలేదని అటు దేవుడ్ని... ఇటు ప్రజలను మభ్యపెట్టడం మానుకుని... చేసిన తప్పులకు పశ్చాత్తాపపడితే... దేవుడు కొంతలో కొంతైనా క్షమిస్తాడేమో....! అలాకాదు అనుకుంటే మేం పొర్లు దండాలు పెడతాం...  మమ్మల్ని కాపాడు దేవుడా... అంటే ఒకప్పుడుండే దాసుడి తప్పులు దండంతో సరి అనే సామెతకు ఇప్పుడు కాలం చెల్లిందనే విషయాన్ని ఇద్దరూ గమనించాల్సి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు