కరోనా పేరు చెప్పి దోచేస్తున్న ఆసుపత్రులూ.. ఖబర్దార్

తెలంగాణలో కార్పొరేట్ ఆసుపత్రుల అరాచకాలపై ఎన్నో వార్తలు విన్నాం. కన్నాం. జనాలు కరోనా బారిన పడి అన్ని రకాలుగా కుదేలువుతంటే.. ఇదే అదనుగా అయిన కాడికి ఫీజులు బాదేసి దోచుకుంటున్న వైనాలపై ఎన్నో ఉదాహరణలు చూశాం. అయినా ప్రభుత్వం దీనిపై దృష్టిసారించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఐతే తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున ఉండే డెక్కన్ ఆసుపత్రి పేషెంట్ల పట్ల మరీ కఠినంగా వ్యవహరించి.. దారుణంగా వ్యవహరిస్తున్న వైనాన్ని ఓ బాధితుడు ట్విట్టర్లో వెలుగులోకి తెచ్చాడు. కరోనా వల్ల తన తల్లిదండ్రులతో పాటు సోదరుడిని కూడా పోగొట్టుకున్నానని.. రూ.40 లక్షల దాకా ఖర్చయిందని.. అయినా సరే ఇంకో ఏడున్నర లక్షలు కడితే తప్ప తండ్రి శవాన్ని ఇవ్వమంటూ డెక్కన్ ఆసుపత్రి వాళ్లు దారుణంగా వ్యవహరిస్తున్నారంటూ అతను ట్విట్టర్లో తన ఆవేదనను వెళ్లగక్కాడు.

దీనిపై కేటీఆర్ స్పందించడం.. తగు చర్యలు చేపట్టాలని ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్‌కు సూచించడం.. ఆ ఆసుపత్రిపై విచారణ చేపట్టడం చకచకా జరిగిపోయాయి. ఈ ఉదంతంపై ఆసుపత్రి వైద్యులు.. తమ వెర్షన్ తెలియజేస్తూ వీడియో రిలీజ్ చేసినా సరే.. ఆసుపత్రి తప్పుల్ని కప్పి పుచ్చలేకపోయారు.

ఈ ఆసుపత్రిలో కరోనా చికిత్స జరిగిన అన్ని కేసులకు సంబంధించిన వివరాలన్నీ పరిశీలిస్తే దారుణాతి దారుణంగా బిల్లులు వేసిన వైనం వెలుగులోకి వచ్చింది. పేషెంట్ల కుటుంబాలతో మాట్లాడితే వాళ్లు వీరి అరాచకాలన్నీ బయటపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఆసుపత్రిలో కరోనా చికిత్స చేయడానికి జారీ చేసిన లైసెన్స్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కాగా డెక్కన్ అనే కాదు.. ఇటీవల కార్పొరేట్ ఆసుపత్రుల అరాచకాల గురించి ఒక నివేదిక ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు చేరింది. ఈ నేపథ్యంలోనే డెక్కన్ ఆసుపత్రిపై చర్యలు చేపట్టి.. మిగతా కార్పొరేట్ ఆసుపత్రులన్నింటికీ హెచ్చరికలు జారీ చేసినట్లున్నారు ముఖ్యమంత్రి.