మోడీ ప్రస్తావిస్తే చాలు సుడి తిరిగిపోతుందంతే

విమర్శలు ఎంతగా విరుచుకుపడని.. మేధావులు ఎంతగా తప్పులు ఎత్తు చూపని.. చివరకు దేవుడే దిగి వచ్చి.. బాబు.. మోడీ మంచోడు కాదన్నా నమ్మే పరిస్థితుల్లో దేశంలోని మెజార్టీ ప్రజలు లేనట్లుగా కనిపిస్తోంది. కరోనా దేశానికి అంతగా రాని వేళలో.. ఒక రోజు ఇంట్లో నుంచి మీరు బయటకు రావొద్దని మోడీ నోటి నుంచి మాట వచ్చిన తర్వాత.. ఏం జరిగిందో తెలిసిందే. అంతలో.. ఆయన పాలోయర్స్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.

ఒక్కరోజు యావత్ దేశం ఇంట్లోనే ఉండిపోతే ఏం జరుగుతుందన్న విషయాన్ని లెక్కలు వేసి చూపించటమే కాదు.. సైంటిఫిక్ గా ఏం జరుగుతుందో తెలుసా? అంటూ లాజిక్ చెప్పే ప్రయత్నం చేశారు ఇంకొందరు ఒక అడుగు ముందుకు వేసి.. సైంటిఫిక్ థియరీలు కూడా వల్లేశారు. చివరకు ఏమైందన్న మాటకు మాత్రం ఎవరూ సమాధానం చెప్పని పరిస్థితి.

మోడీ మీద మీకు కడుపు మంట. అందుకే ఆయన్ను ఏదోలా బద్నాం చేస్తారనేటోళ్లకు కొదవ లేదు. అంతలా దేశ ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న ఆయన నోటి నుంచి ఎప్పుడైనా.. ఎవరి గురించైనా వస్తే తర్వాతేం జరుగుతుందనటానికి తాజా ఉదంతం ఒక చక్కటి ఉదాహరణగా చెప్పక తప్పదు.

తన మన్ కీ బాత్ తో పాటు.. సాధారణ ప్రసంగాల్లోనూ కడు సామాన్యుల గురించి.. స్ఫూర్తివంతమైన కథనాల గురించి ప్రస్తావిస్తారు. ఆ తర్వాత వారికి అనూహ్యమైనఆదరణ వచ్చేస్తుంది. తాజాగా అలాంటిదే మరోసారి చోటు చసేకుంది.

ఇటీవల తన మన్ కీ బాత్ లో ప్రధాని మాట్లాడుతూ.. మధుబనీ పెయింట్స్ గురించి ప్రస్తావించారు. వారు తయారు చేసే మాస్కుల గురించి.. వాటి ప్రత్యేకతను ప్రస్తావించారు. చేతివృత్తుల గురించి మాట్లాడే క్రమంలో ఆయన నోటి నుంచి వచ్చిన మాటకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది.

మన్ కీ బాత్ లోమధుబనీ మాస్కుల గురించి చెప్పిన 72 గంటల్లోనే వీటికి డిమాండ్ పెరిగిపోయిందని.. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఫోన్లు వస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇంతకీ.. ఈ మధుబనీ మాస్కుల విషయానికి వస్తే.. దర్భంగా జిల్లాకు చెందిన దాదాపు రెండున్నర వేల మంది కళాకారులు విలక్షణమైన మాస్కుల్ని రూపొందిస్తున్నారు. మాస్కు మీద అందమైన పెయింట్ ఉండటం వీటి ప్రత్యేకత.

వీటి అందం.. నాణ్యత గురించి ప్రధాని నోటి నుంచి వచ్చనంతనే వాటి గురించి ఎంక్వయిరీలు మొదలయ్యాయి. ఈ మాస్కు ఒక్కొక్కటి రూ.25 నుంచి రూ.50 వరకు ఉంటాయి. ఇప్పటివరకు వీరు 2 లక్షల పెయింటింగ్ మాస్కుల్ని సరఫరా చేశారట. తాజాగా వీరికొచ్చిన డిమాండ్ కు వీరి దశ మారినట్లేనని చెబుతున్నారు. అంతేకాదు..వీరు తయారు చేసే మాస్కులకు డిమాండ్ పెరగటం.. అక్కడ నుంచి కూడా ఆర్డర్లు రావటం గమనార్హం.