టీ కాంగ్రెస్‌కు పెద్దదిక్కు జానారెడ్డి?

టీ కాంగ్రెస్‌కు పెద్దదిక్కు జానారెడ్డి?

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి షాక్‌ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుందా? తప్పు మీద తప్పు చేసి.. విభజనను అడ్డగోలుగా చేయటమే కాదు.. దానికి విపరిణామాలకు బలైన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు ఆ తప్పులు చేయాలనుకోవటం లేదా? జరిగిందేదో జరిగిపోయినప్పటికీ.. తాజాగా మాత్రం ఆచితూచి ఆడుగులు వేయాలని భావిస్తుందా? అంటే అవుననే భావన వ్యక్తమవుతోంది.

తెలంగాణ కాంగ్రెస్‌పార్టీ సారథ్య బాధ్యతను పొన్నాల లక్ష్మయ్యకు అప్పజెప్పటం ద్వారా తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు జానారెడ్డి, డీ శ్రీనివాస్‌ లాంటి వారిని పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై పార్టీలో భారీగా వ్యతిరేకత వ్యక్తం కావటమే కాదు.. పలు సందర్భాల్లో నాయకత్వంపై అసంతృప్తిని పలువురు నేతలు, కార్యకర్తలు బాహాటంగానే వ్యక్తపరిచారు కూడా.

ఈ నేపథ్యంలో జరిగిన తప్పుల్ని ఒకదాని తర్వాత ఒకటిగా సరిదిద్దుకోవాలని భావిస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుంది. తాజాగా మెదక్‌ లోక్‌సభ స్థానానికి సెప్టెంబర్‌ రెండో వారంలో జరిగే ఉప ఎన్నికకు సంబంధించిన అభ్యర్థి ఎంపిక బాధ్యతను సీనియర్‌ నేత జానారెడ్డికి అప్పగిస్తూ డిగ్గీరాజా తాజాగా ఒక ప్రకటన చేశారు. మెదక్‌ అభ్యర్థి ఎంపిక బాధ్యత జానారెడ్డిదేనని తేల్చేశారు.

డిగ్గీ వ్యాఖ్యల్ని చూస్తే... ఒక్కసారిగా కాకున్నా.. దశల వారీగా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధినేత హోదాలో కూర్చోబెట్టేందుకు తాజా నిర్ణయం ఒక అడుగుగా భావించాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు