సబితమ్మ డుమ్మా కొట్టింది !

సబితమ్మ డుమ్మా కొట్టింది !

రాష్ట్ర హోంమంత్రిగా కాంగ్రెస్‌ పాలనలో చక్రం తిప్పిన చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి ఇబ్రహీంపట్నంలో జరుగుతున్న కాంగ్రెస్‌ పార్టీ రెండు రోజుల సదస్సుకు డుమ్మా కొట్టింది. సబితా ఇంద్రారెడ్డితో పాటు ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి, ఆ వర్గం నేతలంతా గైర్హాజరయ్యారు. ఇక మరో నేత మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా ఈ సదస్సుకు హాజరుకాలేదు. భూగర్భ గనుల శాఖా మంత్రిగా, ఆ తరువాత హోంమంత్రిగా సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా రాజకీయాలలో కీలకపాత్ర పోషించారు. అయితే ఒక కుటుంబానికి ఒక్కటే టికెట్‌ పథకంలో ఇటీవల ఎన్నికల్లో ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్‌ ఇచ్చి సబితమ్మను పక్కకు పెట్టారు. ఈ ఎన్నికల్లో ఆమె కుమారుడు ఓటమి పాలయ్యారు.

మరి ఓటమితో కలతచెందారో ? లేక పార్టీ మీద అసంతృప్తితో ఉన్నారో ? తెలియదు గానీ సబితా ఇంద్రారెడ్డితో పాటు కార్తీక్‌రెడ్డి సమావేశాలకు రాకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో తమకు ప్రాధాన్యత దక్కడం లేదన్న అభిప్రాయంతో ఉన్నవారు పార్టీ మారొచ్చు అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణలో సమర్ధవంతంగా నడిపే నాయకుడు ఎవరూ ఇప్పుడు కనిపించడం లేదు. అందుకే ఆ పార్టీని వీడి మరో పార్టీలో చేరిపోవడం మేలన్న ఆలోచనలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏ విషయంలో చెల్లెమ్మ నోరుతెరిస్తేగాని తెలియదు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు