బాహాటంగానే తిట్టేసుకున్నారు

బాహాటంగానే తిట్టేసుకున్నారు

అధికారం హస్తగతమైతే చాలు తమంతటి వాళ్లు లేరన్నట్లుగా వ్యవహరించే కాంగ్రెస్‌ నేతలు.. పవర్‌ ఆవిరి అయితే చాలు.. బజారున పడిపోవటం.. తిట్లు.. అరుపులు.. విమర్శలు.. ఆరోపణలు చేసుకోవటం మామూలే.

తాజాగా అలాంటి పరిస్థితి కాంగ్రెస్‌ అధిష్ఠానం దూత డిగ్గీరాజా సమక్షంలోనే చోటు చేసుకోవటం గమనార్హం.తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఓటమి పాలు కావటంపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ టిక్కెట్లను నేతలు అమ్ముకోవటం వల్లే పార్టీ ఓడిపోయిందని.. ఎన్నికల్లో ఓటమికి కారణం నేతలే అంటూ బాహాటంగా తిట్టటం కనిపించింది.

ఇదంతా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలో నిర్వహించిన మేధోమధన సదస్సులో కనిపించింది. కాంగ్రెస్‌ కార్యకర్తలు మధ్యలో నినాదాలు చేయటం.. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని గట్టిగా అరవటంతో కల్పించుకున్న డిగ్గీరాజా.. ''మా దగ్గర వీడియో ఫుటేజ్‌ ఉంది. దాని ఆధారంగా కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు.. గలభా సృష్టించేందుకు ప్రయత్నించిన వారిని ఈరోజే పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తాం'' అని ప్రకటించారు. క్రమశిక్షణారాహిత్యాన్ని సహించలేమని.. అలాంటి వారిపై వెనువెంటనే చర్యలు తీసుకుంటామని డిగ్గీరాజా అగ్రహించటంతో సభ కాస్త సద్దుమణిగింది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు