ఏపీని ఎవరో ఒకరికి అప్పగించేయ్‌ బాబు

ఏపీని ఎవరో ఒకరికి అప్పగించేయ్‌ బాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడి తీరుపై ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాబును నమ్మి ఓట్లు వేస్తే.. అధికారంలోకి వచ్చాక కూడా తెలంగాణలో పార్టీపై ఆయన తనకున్న మమకారాన్ని వదిలిపెట్టకపోవటం చర్చనీయాంశంగా మారింది.

విపక్షంలో ఉన్నప్పుడు.. రెండు కళ్ల సిద్ధాంతం తప్పనిసరి అని సరిపెట్టుకున్న వారు ఉన్నారు. సుదీర్ఘకాలం అధికారానికి దూరంగా ఉన్న నేపథ్యంలో.. విభజన వ్యవహారంలో ఒక బలమైన నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేని దుస్థితిలో రెండు కళ్ల సిద్ధాంతం గురించి బాబు చెప్పినప్పుడు సరేనని తలూపిన వారు చాలామందే ఉన్నారు. ఆయన సిద్ధాంతం కారణంగా.. తెలంగాణకు లబ్థి చేకూరితే.. సీమాంధ్రకు తీరని నష్టం జరిగింది.

లాభం పొందిన తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెయ్యి చూపిస్తూ.. కంటితుడుపు సీట్లను అందిస్తే.. అందుకు భిన్నంగా బాబు మీద భరోసాతో సీమాంధ్రులు మాత్రం అధికారాన్ని అప్పగించారు. దీంతో విభజన అనంతరం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం తెలిసిందే. అధికారాన్ని చేతికి ఇచ్చిన ప్రాంత  ప్రయోజనాల కంటే కూడా ఎదురుదెబ్బ తగిలిన ప్రాంతంలోని పార్టీ ప్రయోజనాల్ని పరిరక్షించేందుకు ఆయన పడుతున్న తపన చూస్తున్న సీమాంధ్రులు చిరాకు పడుతున్నారు.

తెలంగాణలో ఉన్న పార్టీని ఏవరో ఒక నేతకు అప్పగించటానికి బదులు తన చేతిలో ఉంచుకున్న ఆయన.. తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్‌ అనే రెండు పడవలపై కాళ్లు వేసి ప్రయాణం చేయాలని భావిస్తున్నారు. ఇక్కడ సమస్య ఏమిటంటే.. విభజన అనంతరం.. ఒక ప్రాంతం ప్రజల హక్కుల్ని పరిరక్షించుకోవటం కోసం మరో ప్రాంత ప్రయోజనాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉండకూడదు.

టీఆర్‌ఎస్‌ అధినేత.. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంగతే చూస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకు తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనాలు తప్పించి మరేమీ ముఖ్యం కాదన్నట్లుగా వ్యవహరిస్తారు. తమ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం అవసరమైతే ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల గురించి అస్సలు పట్టించుకోరు. దీనివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎక్కువ లబ్థి చేకూరుతోంది.

అదే సమయంలో చంద్రబాబు మాత్రం రెండు ప్రాంతాల ప్రజల ప్రయోజనాలు తమకు ముఖ్యమే అని తరచూ వ్యాఖ్యలు చేయటం ద్వారా.. తెలంగాణ ప్రజల కోసం సీమాంధ్రుల  ప్రయోజనాల్ని పట్టించుకోలేని పరిస్థితి. ఇద్దరు కొడుకులున్న తండ్రికి.. ఒక కొడుకే ఉన్న తండ్రి మధ్య ఎంత తేడా ఉంటుందో ప్రస్తుతం కేసీఆర్‌.. చంద్రబాబుల మధ్య కూడా అంతే వ్యత్యాసం ఉంది.

ఇద్దరి కొడుకుల్ని సమంగా చూసుకునే ప్రయత్నంలో బాగంగా ప్రతి సందర్భంలో ఇద్దరిలో ఎవరినో ఒకరిని అసంతృప్తికి గురి చేయక తప్పదు. అధికారంలో లేని తెలంగాణలో పార్టీని బలోపేతం చేయటం కోసం.. అధికారం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజల విషయంలో కాస్త అటూఇటూగా వెళ్లినా ఫర్లేదన్న వైఖరిని బాబు ప్రదర్శిస్తున్నారు. నమ్మి ఓట్లేసి అధికారం ఇచ్చిన వారి విషయంలో అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లే ఇస్తూ.. తనకు తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనాలు ముఖ్యమేనని.. వారి సమస్యలపై తాను పోరాడతానని ప్రకటించటం ద్వారా.. ఏపీ ప్రజల ప్రయోజనాల్ని అయోమయంలో పడేస్తున్నారునే చెప్పాలి.

తమది ప్రాంతీయ పార్టీ కాదని. జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు.. రెండు ప్రాంతాల్లోని ప్రజల ప్రయోజనాల్ని పరిరక్షించే రక్షకుడి పాత్రను పోషించాలంటే.. రెండు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్ష పదవుల్ని ఇద్దరు సమర్థవంతులైన నేతలకు అప్పజెప్పి.. ఏపీలో ముఖ్యమంత్రి పదవిని మరో నేతకు అప్పగించి.. ఢిల్లీకి వెళ్లి కూర్చోవటం ద్వారా పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం మాట్లాడితే బాగుంటుంది. అంతే కానీ.. అధికారం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్ని పట్టించుకునే కన్నా.. అధికారం లేని తెలంగాణలో కీలకభూమిక పోషిస్తానని చెప్పటం.. పర్యటనలు చేస్తానని చెప్పటం సగటు సీమాంధ్రుడి సెంటిమెంట్లను దెబ్బ తీయటంగానే భావించాలి. మరి.. ఈ విషయంలో బాబు వాస్తవిక కోణంలో ఎప్పుడు ఆలోచిస్తారో మరి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English