మీరిచ్చిన హామీ నీళ్ల మూటేనా బాలయ్య?

మీరిచ్చిన హామీ నీళ్ల మూటేనా బాలయ్య?

వెండితెర మీద హీరోయిజం పండించే నందమూరి బాలయ్య అంటే తెలుగువారికి అదో అభిమానం. ఆవేశంతో ఆయన డైలాగు చెబుతుంటే మాస్‌ ఊగిపోతుంటారు. కత్తి పట్టుకొని ఆయన హీరోయిజం పండిస్తుంటే.. థియేటర్‌లో ఈలలు.. అరుపులకు లోటు ఉండదు. రీల్‌ లైఫ్‌లో ఆయన మాటే ప్రభంజనంలా.. తన నోటి నుంచి మాట రావాలే కానీ దాన్ని నెరవేర్చే వరకూ వెనక్కి తగ్గని బాలయ్య బాబు రియల్‌ లైఫ్‌లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు మొదలయ్యాయి.

సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ తీర్థం పుచ్చుకున్న ఆయన.. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా హిందూపురం వాసులకు బాలయ్యబాబు ఇచ్చిన హామీ ఏమిటంటే.. తాను కానీ ఎమ్మెల్యేగా గెలిచి.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. హిందూపురాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తామన్నారు.

బాలయ్య బాబు మాత్రమే కాదు.. నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సైతం కొత్త జిల్లా ఏర్పాటుపై హామీ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. అభివృద్ధిలో వెనుకబడ్డ పల్నాడు ప్రాంతం అంతా కలిపి పల్నాడు జిల్లాగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఎన్నికల సమయంలో నేతలు ఇచ్చిన హామీలతో ప్రజలు చాలానే కలలు కన్నారు. కొత్త జిల్లాగా ఏర్పడితే అభివృద్ధి మరింత వేగంగా ఉంటుందని.. దాంతో తమ జీవితాల్లో ఎంతోకొంత మార్పు వస్తుందని  నమ్మిన అక్కడి ప్రజలకు.. తెలుగుదేశం ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఆశనిపాతంగా మారింది.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం.. కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయకూడదని టీడీపీ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు అధికారికంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. కొత్త జిల్లాల ఏర్పాటు లేనట్లే అంటూ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అధికారికంగా శాసన మండలిలో ప్రకటించారు కూడా. రాయపాటి మాటను కాస్త పక్కన పెడదాం. మరి.. బాలయ్య బాబు ఇచ్చిన మాట కూడా చెల్లదా?

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు