మొగన్నిగొట్టి మొత్తుకుంటున్న జగన్‌ !

మొగన్నిగొట్టి మొత్తుకుంటున్న జగన్‌ !

శాసనసభ అంటేనే హుందాగా వ్యవహరించాలి. రాజకీయంగా ఎంత వైరం ఉన్నప్పటికి సభలో మాట్లాడేటప్పుడు దాని తాలూకు హావభావాలు కూడా బయటపడనివ్వకూడదు. అసలు సభ్యుడి పెద్దరికం బయటపడేదే అక్కడ. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహారం మొగున్ని కొట్టి మొత్తుకున్నట్లుగా ఉంది. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను ఉద్దేశించి 'బఫూన్ల'కు సమాధానం చెప్పేది ఏంటి ? అంటూ తోటి సభ్యులను గేలిచేసిన జగన్‌ ఆ మాటలను వెనక్కు తీసుకోకపోగా తిరిగి అధికారపక్షాన్నే నిందిస్తూ ఆరోపణలు చేస్తుండడం, సభను వాకౌట్‌ చేయడం, మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నోటికి నల్లగుడ్డలు కట్టుకుని సభలో తమ గొంతు నొక్కుతున్నారని ఆరోపించడం విడ్డూరంగా ఉంది.

గత మూడు నెలల తెలుగుదేశం పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలను హత్యలు చేస్తున్నారని, దాడులకు పాల్పడుతున్నారని శాంతిభద్రతల మీద జగన్‌ సభలో చర్చకు పట్టుబట్టారు. దీంతో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు  వైఎస్‌ హయాంలో జరిగిన పలు హత్యలతో పాటు పరిటాల రవి హత్యను తెరమీదకు తెచ్చారు. దీంతో అసహనానికి గురయిన జగన్‌ చేయని తప్పుకు తాను బఫూన్లకు సమాధానం చెప్పాలా ? అంటూ విమర్శ గుప్పించారు. జగన్‌ వ్యాఖ్యలు సభలో గందరగోళం రేపాయి. క్షమాపణ చెప్పాలని, వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని టీడీపీ సభ్యులు పోడియం చుట్టుముట్టి డిమాండ్‌ చేశారు.అయితే జగన్‌ మాత్రం కనీసం వ్యాఖ్యలను వెనక్కు తీసుకునేందుకు కూడా ఒప్పుకోవడం లేదు. నేను మూడు నెలల నుండి జరుగుతున్న హత్యల గురించి మాట్లాడితే మీరు పదేళ్ల క్రితం జరుగుతున్న దాని గురించి మాట్లాడుతారా ? అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. పదేళ్ల క్రితం అయినా వందేళ్ల క్రితం అయినా సభలో మాట్లాడుతున్న జగన్‌కు అప్పట్లో జరిగిన సంఘటనతో సంబంధం ఉంది అన్న ఆరోపణల మీదనే సభ్యులు ప్రశ్నిస్తున్నారు. కానీ జగన్‌ మాత్రం దానికి సమాధానం చెప్పకుండా అధికార పక్షం మీద ఎదురుదాడికి దిగుతున్నారు.

అధికారపక్షం క్షమాపణకు పట్టుబడుతుంటే జగన్‌ పార్టీ సభ్యులు సభలో దానికి ధీటుగా స్పందిస్తున్నారు. చివరకు ఈ రోజు ఏకంగా శాసనసభ నుండే జగన్‌ వాకౌట్‌ చేశారు. శాసనసభ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ఎదుట నల్ల రిబ్బన్లతో నిరసన తెలుపుతుండడం గమనించవలసిన అవసరం ఉంది. సభలో టీడీపీ సభ్యులను బఫూన్లు అన్న జగన్‌ ఇప్పుడు తన చర్యలతో జనాలను కూడా బఫూన్లను చేసే ప్రయత్నంలో పడ్డట్లు కనిపిస్తోంది. ఈ వ్యవహారం ఎంతవరకు లాగుతారో ? వేచిచూడాలి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు