దీపావళి తర్వాత 'టీ'లో భూ సర్వే

దీపావళి తర్వాత 'టీ'లో భూ సర్వే

సమగ్ర సర్వే సూపర్‌హిట్‌ అయిన నేపథ్యంలో తెలంగాణ సర్కారు తన తదుపరి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. సమగ్ర సర్వే ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కుటుంబాలెన్ని.. ఎన్ని ఇళ్లు ఉన్నాయి? వాటి స్థితి గతులతోపాటు.. రాష్ట్రంలో నివసించే వారికి సంబంధించిన ఆర్థిక.. సామాజిక స్థితిగతులను సర్వే ఒక లెక్క తేల్చింది. జనాభా గణన కంటే ఎంతో మెరుగ్గా ఉండటంతో పాటు.. శాస్త్రీయంగా చేపట్టిన సర్వే పుణ్యమా అని ఇప్పటికే దాని ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఒక అంచనా ప్రకారం.. తెలంగాణ సర్కారు చేపట్టిన సర్వే పుణ్యమా అని బోగస్‌ రేషన్‌ కార్డులతో పాటు.. బోగస్‌ లబ్థిదారులను తేలిగ్గా గుర్తించే వీలు ఉంటుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ సర్వే పుణ్యమా అని సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు తగ్గే అవకాశం కూడా ఉంటుందన్న వాదన బలంగా వినిపిస్తోంది.

సర్వే స్ఫూర్తిగా తీసుకొని కేసీఆర్‌ సర్కారు మరో వినూత్నమైన నిర్ణయాన్ని తీసుకుందని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తగా భూ సర్వే చేపట్టాలని భావిస్తున్నారు. ఇందుకోసం దీపావళి తర్వాత తెలంగాణ రాష్ట్రం మొత్తం భూముల సర్వేలు చేపట్టి.. ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల ప్రకారం.. ప్రజల వద్దనున్న ఆస్తి లెక్కల్ని తనిఖీ చేస్తారు.

ఇప్పటివరకూ అధికారులు వేసిన అంచనా ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా 12,700 ఎకరాల మేర ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతమైందన్న లెక్కలున్నాయి. దీని విలువ దగ్గర దగ్గర.. రూ.60,500కోట్లు ఉంటుందని లెక్క కడుతున్నారు. 1938లో నిజాం ప్రభుత్వం తర్వాత ఇప్పటివరకూ సమగ్ర భూమి సర్వేను ఇంతవరకూ ఏ  ప్రభుత్వం నిర్వహించలేదు. దీంతో  ప్రభుత్వ భూమి పెద్దఎత్తున అన్యాక్రాంతమైందన్న ఆరోపణలు ఉన్నాయి. దీపావళి తర్వాత నిర్వహించే భూ సర్వే పుణ్యమా అని భూబకాసురుల లెక్కలు తేలిపోనున్నాయన్న వాదన వినిపిస్తోంది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు