టూరిస్ట్‌ ఎవరు?

టూరిస్ట్‌ ఎవరు?

కేసీఆర్‌ మామూలోడు కాడు. మాట్లాడే ఒక్క మాట అయినా ఆచితూచి కాకుండా.. సూటిగా.. ఎక్కడ కొడితే మైండ్‌ బ్లాక్‌ అయిపోయి.. అవతలి వ్యక్తి అడ్డంగా బుక్‌ అయిపోతాడో ఆ స్థాయిలో విమర్శలు చేయటం కేసీఆర్‌కు కొత్తేమీ కాదు.

సమగ్ర సర్వేలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన పేరును నమోదు చేసుకోలేదన్న దానిపై స్పందించిన కేసీఆర్‌.. ''టూరిస్ట్‌ మాదిరి ఉండాలనుకున్నారేమో?'' అంటూ వ్యాఖ్యానించారు. ఓవైపు కోర్టు సైతం సర్వే తప్పనిసరి కాదని తేల్చి చెప్పటమే కాదు.. సర్వే అన్నది ఐచ్ఛికం.. మీకు ఇష్టం ఉంటే పాల్గనవచ్చు.. లేదంటే లేదని తేల్చేసింది.

తెలంగాణ రాష్ట్ర సర్కారు లెక్కలో ఉండాలనుకుంటే సర్వేలో పాల్గనాలని తెలంగాణ సర్కారు చెప్పినా.. అలాంటివేమీ లేవని కోర్టు చెప్పాక.. ఒక వ్యక్తిగా తనకు తోచినట్లు వ్యవహరించే స్వేచ్ఛ ఉంటుంది. దాన్ని ఎవరూ ఏమీ కాదనలేరు.

సర్వే చేస్తున్న రోజున మీ ఇంట్లో పెళ్లి పెట్టుకుంటే దాన్ని కూడా వాయిదా వేసుకోండని చాలా సింఫుల్‌గా కేసీఆర్‌ తేల్చేశారు. పెళ్లి అంటే ముందురోజో.. నెల ముందో కాదు.. కొన్నిసార్లు ఆర్నెల్ల ముందు కూడా ముహుర్తం పెట్టేసుకుంటారు. అలాంటి వేడకను సైతం వద్దనేసే విషయంలో ఎలాంటి మొహమాటం ప్రదర్శించని ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తన కటుంబ సభ్యుల విషయంలో ఇంకెంత గట్టిగా ఉండాలి.

కోట్లాది మంది ప్రజలకు.. ''మీరు ఇలా ఉండాలి. ఇలా చేయాలి'' అంటూ చెబుతున్న ఆయన.. సొంత కుటుంబ సభ్యుల విషయంలోనూ అదే ధర్మాన్ని పాటించాలి. కానీ.. నీతులు చెప్పేందుకు.. విరుచుకుపడేందుకు ఊళ్లో వాళ్లే కనిపించే కేసీఆర్‌ ఫ్యామిలీకి సొంత మనషులు చేసేవేవీ తప్పులుగా కనిపించవు. ఇంట్లో లేని.. ఆ మాటకు వస్తే ఊర్లోనే లేని పవన్‌ కల్యాణ్‌ ఏ అవసరం కోసం బయటకు వెళ్లాడో తెలీదు.

తొందరపడి ఒక మాట అనే ముందు.. తమ గురించి తాము చూసుకోవాలి కదా. ఎదుటి మనిషిని వేలెత్తి చూపించే ముందు.. మనమేంటన్న విషయాన్ని ఎప్పుడూ పట్టించుకోని కేసీఆర్‌.. టూరిస్ట్‌ వ్యాఖ్యల విషయంలోనూ అదే రీతిలో వ్యవహరించారు. పవన్‌ కల్యాణ్‌ తెలంగాణ ప్రజలకు జవాబుదారీ కాదు. ఆ మాటకు వస్తే ఆయనకు తెలంగాణ ప్రజలేమీ రాజ్యాంగ బద్ధమైన అధికారాన్ని ఇవ్వలేదు.

కానీ.. కేసీఆర్‌ కుమార్తె ఎంపీ కవిత అలా కాదు. ఆమెను ప్రజలు ఓట్లేసి ఎన్నుకోవటమే కాదు.. తెలంగాణ గాంధీగా తమకు తాము చెప్పుకునే కుటుంబం నుంచి వచ్చిన ఆ యమ్మ సమగ్ర సర్వే రోజున మాత్రం ఇంట్లో ఉండకుండా ఎక్కడకు వెళ్లినట్లు. నిజమే.. పవన్‌ ఊళ్లో లేకుండా వెళ్లిన దానికి సమర్థించినప్పుడు కవిత విషయంలోనూ అదే లాజిక్‌ అమలవుతుంది కదా అని ప్రశ్నించొచ్చు.

కానీ.. కవిత కేసీఆర్‌ కుమార్తె అన్న విషయాన్ని మర్చిపోకూడదు. అంతేకాదు.. ఇళ్లల్లో పెళ్లిళ్లు కూడా సర్వే జరిపే రోజున క్యాన్సిల్‌ చేసుకోవాలని పిలుపునిచ్చిన పెద్దమనిషి కుమార్తె. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తనకు తానుగా ఇంట్లో ఉండకుండా.. సర్వేలో స్వయంగా పాల్గనకుండా అత్త.. మామల చేత పేరు నమోదు చేయించుకున్న కవిత.. పవన్‌ కల్యాణ్‌ సర్వేకు హాజరుకాకపోవటంపై విమర్శలు కురిపించారు. కవిత వ్యవహారం చూస్తే.. గురివిందే గుర్తుకొస్తుంది. ఇంతకీ అసలైన టూరిస్ట్‌ ఎవరో అర్థమైందా?

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు