ఆంధ్రా ఎంపీలు ఎందుకు రియాక్ట్‌ కావటం లేదు

ఆంధ్రా ఎంపీలు ఎందుకు రియాక్ట్‌ కావటం లేదు

రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఇప్పటికే నష్టపోవాల్సినంతగా నష్టపోయిన దుస్థితి. కాంగ్రెస్‌ కావొచ్చు.. బీజేపీ కావొచ్చు ఇద్దరూ ఇద్దరే అన్న చందంగా వ్యవహరించటంతో భారీ నష్టమే వాటిల్లింది.

ఆంధ్రా ప్రాంతమంటే విరుచుకుపడే కేసీఆర్‌ లాంటి వ్యక్తి సైతం.. ''అవును.. విభజనలో ఆంధ్రాకు నష్టం జరిగింది' అని ఒప్పుకునేంత. అలాంటివి ఒకవైపు జరిగిపోయినప్పుడు హక్కుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. విభజన చట్టంలో భాగంగా పదేళ్ల పాటు ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పిస్తు నిర్ణయం తీసుకున్నారు.

శాంతిభద్రతలతో పాటు.. కీలకమైన అంశాల్లో గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఇస్తూ విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే.. వాటిపై తెలంగాణ రాష్ట్ర అధికారపక్షమైన టీఆర్‌ఎస్‌ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేయటమే కాదు.. దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

హైదరాబాద్‌లో అధికారాలు గవర్నర్‌కు ఎలా అప్పగిస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. మరి వారికి అంత నొప్పిగా ఉంటే.. గవర్నర్‌కు అధికారాలు ఏమీ ఇవ్వని పక్షంలో రేపొద్దున సీమాంధ్రులకు ఏదైనా జరిగితే వారికి దిక్కెవరు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాను తెలంగాణ ప్రజల పక్షపాతినని పదేపదే స్పష్టంగా వెల్లడించింది. తమకు తెలంగాణ ప్రజల మంచిచెడ్డలే ముఖ్యమని.. ఆ తర్వాతే ఇంకే విషయం మీదనైనా ఫోకస్‌ చేస్తామని టీఆర్‌ఎస్‌ నేతలు పదే పదే స్పష్టం చేస్తుంటారు.

మరి అలాంటప్పుడు ఉమ్మడి రాజధానిపై సమాన హక్కులు ఉన్న ఆంధ్రా ప్రాంత నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? తాజాగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసి.. గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఇవ్వద్దని కోరుతున్నారు. మరి.. వారు అలా కోరుతున్నప్పుడు.. సీమాంధ్ర ఎంపీలు గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఇప్పించేలా.. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు అమలు అయ్యేలా ఒత్తిడి తీసుకురావాలి కదా? మరి.. సీమాంధ్ర ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నట్లు?

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు