బాబూ.. నిజాలు చెప్పు!

బాబూ.. నిజాలు చెప్పు!

ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్ర చేసేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. రూ.1.11 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ ప్రకటించారు. బడ్జెట్లోనే ఎన్నో సంక్షేమ పథకాలూ అమలు చేస్తామని చెప్పారు. ఈ బడ్జెట్‌ చూస్తే రాబోయే రెండు మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ అద్భుతం అయిపోతుందన్నట్లుగా ఉంది. కానీ, అందులోని ఆర్థిక పరిస్థితి చూస్తే మాత్రం బేజారుగానే ఉంది.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి తీసికట్టుగా ఉందని చెబుతున్నారే తప్ప.. ఎంత ఆదాయం వస్తుందనే దానిపై ఇప్పటి వరకు కచ్చితమైన లెక్కలు లేవు. ఇక బడ్జెట్లో ప్రణాళికా వ్యయం కూడా భారీగా పడిపోయింది. ద్రవ్యలోటు భారీగా పెరిగిపోయింది. బడ్జెట్‌ ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై భారీగానే ఆశలు పెట్టుకుంది. కానీ, మోడీ అంత ఉదారత చూపించే పరిస్థితులు కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలను అమలు చేయడం కత్తి మీద సామే. అయితే, ఆ విషయం చెప్పడానికి చంద్రబాబు ఎందుకో వెనకాడుతున్నారు. నేను అంతా సర్దుతాను.. నేను చూసుకుంటాను అంటున్న ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించకపోవడం వల్లనే విమర్శల పాలవుతున్నారు.

వాస్తవానికి, చంద్రబాబు చెప్పినట్లు ఈ బడ్జెట్‌ అంతా డొల్లే. అన్నీ తాత్కాలిక లెక్కలే. ఎందుకంటే, గతంలో ఆదాయం అంతా హైదరాబాద్‌ కేంద్రంగా వసూలు అయినందున ఇప్పుడు ఏ శాఖ నుంచి ఎంత ఆదాయం వస్తుంది.. మొత్తంగా ఎంత ఆదాయం వస్తుందనే దానిపై ఇతమిత్థంగా వివరాలు లేవు. ఆదాయం ఎంతో తెలియకుండా ఖర్చులు ఎలా సాధ్యం? అందుకే ఈ బడ్జెట్లో యనమల వారు చూపించినవన్నీ కాకిలెక్కలే. ఇదే విషయాన్ని స్పష్టం చేసేస్తే.. ప్రజల్లో ఆశలు, ప్రతిపక్షాల విమర్శల నుంచి తప్పుకోవచ్చు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు