వామ్మో.. తిరుమలకు లెటర్లా..?

వామ్మో.. తిరుమలకు లెటర్లా..?

అధికారం చేతిలో ఉన్నప్పుడు అధికార పక్షానికి చెందిన నేతల ధీమానే వేరుగా ఉంటుంది. పెద్దపెద్ద పనుల సంగతి పక్కన పెడితే.. తిరుమలలోదర్శనానికి సంబంధించిన సిఫార్సు లేఖ.. రూమ్‌ల కోసం సిపార్సుల లేఖను అలా ఇష్యూ చేసేసేవారు.

కానీ.. తాజాగా మాత్రం తెలుగు తమ్ముళ్లు కిందామీదా పడిపోతున్నారు. అదేం చిత్రమో.. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ ఎమ్మెల్యేల మాటను టీటీడీ అధికారులు అస్సలు వినటం లేదట. వారు పంపిన సిఫార్సు లేఖల్ని చెత్తబుట్టలో పడేయటంతో.. వాటిని తీసుకెళ్లిన వారు తమ ఎమ్మెల్యే వద్దకు వెళ్లి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట.

పదేళ్ల కాంగ్రెస్‌ సర్కారు హయాంలో ఇష్టారాజ్యంగా హవా నడిపితే.. అంత కాకున్నా.. కనీసం రూమల విషయంపై సిఫార్సుకు కూడా టీటీడీ అధికారుల స్పందన అంతంతమాత్రంగా ఉంటుందని.. ఇక.. బ్రేక్‌ దర్శనాలకైతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. చేతిలో అధికారం ఉందనే కానీ.. తిరుమల కొండ మీద మాత్రం తమకున్న పవర్స్‌ సరిపోవటం లేదని చెబుతున్నారు. ఈ కారణం చేతనే.. తిరుమల కొండకు సంబంధించి ఎలాంటి సిఫార్సు చేయటానికి టీడీపీ ఎమ్మెల్యేలు ఏ మాత్రం ఇష్టపడటం లేదు. అధికారం ఉన్నా.. లేకున్నా తమ్ముళ్లకు పెద్ద తేడా ఏమీ ఉండటం లేదేమో.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు