కోదండరాం కొత్త మెలిక

కోదండరాం కొత్త మెలిక

ఏది ఏమైనా తెలంగాణ ఐకాస ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మహా తెలివైన వ్యక్తి. కేసీఆర్ అంతటి మహానేతకు సైతం వెన్నులో చలి పుట్టించిన ఘటికుడు.  ఈ మాస్టారి దగ్గర ఎవరి పప్పులూ ఉడకవు. ఉద్యమం అని చెప్పి.. మాయ చేసి మైలేజ్ పొందాలని ఎవరైనా ప్రయత్నిస్తే అస్సలు ఊరుకోరు. అందరితో పాటు.. లాఠీ దెబ్బలు తినాలి.. కేసులు వేయించుకోవాలి.. లాకప్ లో కూర్చోవాలే తప్ప... ఉత్త హడావుడికి అయన అస్సలు అంగీకరించరు. గతంలో కొన్ని ఉద్యమాలు చేసినప్పుడు... నిజంగా పని చేసిన వారి కంటే... షో చేసిన వారు కొందరు నేతలుగా ఓ వెలుగు వెలిగిపోయారు. అందుకే ఈసారి అలాంటి వారి ఆటలు సాగకూడదని మాస్టారు ఓ ప్లాన్ వేశారు.

చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనే నేతలు ఎవరైనా సరే పోలీసుల చేతికి చిక్కి అరెస్టు అయితే తెలంగాణను మోసం చేసినట్లు ఆయన సరికొత్త తీర్మానం చేసేశారు. ఇంతకీ ఆయన సమస్య ఏమిటంటే.. చలో అసెంబ్లీని విజయవంతం చేయాలంటే నాయకులంతా క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఇందుకు ఉండే ఇబ్బందులు చాలానే. కీలక సమయంలో పోలీసుల కన్నుగప్పి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోతే.. ఆ తర్వాత కూడా పోలీసుల నుంచి తిప్పలు తప్పవు. అందుకని కొంతమంది నేతలు బయటకు షో చేస్తూ.. పోలీసులకు టచ్ లో ఉంటూ తమను మరీ ఇబ్బంది పెట్టొద్దంటూ రాజీ చేసుకుంటారు. ఇలాంటివారి వల్ల ఉద్యమం తీవ్రత తగ్గుతుందని మాష్టారు అర్థం చేసుకున్నారు. అందుకే... ఆయన ఉద్యమంలో పాల్గొనే నేతలకు సరికొత్త షరతు పెట్టారు. అదేమంటే... చలో అసెంబ్లీ రోజున కనుక పోలీసుల చేతికి చిక్కి అరెస్టు అయితే వాళ్లు తెలంగాణ ప్రజలను మోసం చేసినట్లేనని ప్రకటించారు. మరి.. నేతలు ఆయన మాటల్ని ఎంత వరకు వింటారో... ఎంతమంది మోసం చేసే వారు త్వరలోనే తేలనుంది. సార్ గారి ఫత్వాను విన్న కొంతమంది తెలంగాణ నేతలకు నిద్ర పట్టటం లేదట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English