పాజిటివిటీ నూరిపోస్తున్న చంద్రబాబు

పాజిటివిటీ నూరిపోస్తున్న చంద్రబాబు

ముఖ్యమంత్రి పదవిని ఈసారి దొరకబుచ్చుకోకపోతే.. ఇక దానికి తనకు మధ్య ఎడం చాలా ఎక్కువ అయిపోతుందని ఆందోళన చెందుతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు.. రాబోయే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసే విషయంలో.. మాత్రం చాలా స్ట్రాటెజిగ్గా వ్యవహరిస్తున్నారు. ఒక పాజిటివ్‌ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. పార్టీ శ్రేణుల్లో కొంత మేర నైరాశ్యం నిండి ఉన్న వాస్తవాన్ని ఆయన గమనించినట్లుగా బాబు మాటతీరు ఈరోజుల్లో కనిపిస్తోంది. దాదాపు మూడు వేల కిలోమీటర్ల పొడవున.. రాష్ట్రంలో పాదయాత్ర ద్వారా పర్యటించి.. ప్రజల కష్టాలను మాత్రమే కాకుండా.. తన పార్టీ కార్యకర్తల మనోభావాలను, పార్టీ పరిస్థితి పై క్షేత్రస్థాయిలో వారి విలువైన వాస్తవ అభిప్రాయాలను కూడా తెలుసుకుని వచ్చిన చంద్రబాబునాయుడు.. విజయం గురించి పని గురించి ప్రస్తావించడం కంటె ముందుగా.. వారిలో ఆశావహ దృక్పథాన్ని, పాజిటివ్‌ ఆటిట్యూడ్‌ను నింపడం తన బాధ్యతగా భావించినట్లు కనిపిస్తోంది. నియోజకవర్గాల వారీగా ప్రస్తుతం నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాల్లో ఆయన ప్రతి మాటలోనూ ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది.

పైగా బాబు వైఖరిలో ఆయన కార్యకర్తలను డీల్‌ చేసే పద్ధతిలో ఇదివరకటి కంటె ఇప్పుడు చాలా మార్పు వచ్చినట్లుగా జిల్లాలనుంచి వచ్చిన వారు కూడా చెబుతున్నారు. చంద్రబాబు తన పాలన సాగుతున్న రోజుల్లో.. వ్యక్తిత్వ వికాసం అంశాలకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆ క్రమంలో ఈ పాజిటివిటీ, పాజిటివ్‌ దృక్పథాన్ని నూరిపోయడం ద్వారా శ్రేణులను సిద్ధం చేయడం వంటి అనేకానేక అంశాలు ఆయన అనుభవంలోకి వచ్చాయి. అయితే వాటితో అప్పట్లో ఆయనకు పెద్దగా అవసరం రాలేదు.

ఇప్పుడు రెండుసార్లు ఎన్నికల్లో దెబ్బతిన్న తర్వాత.. మూడో సారి ఎదుర్కొంటున్న ఎన్నికలకు.. పార్టీ శ్రేణులను సిద్ధం చేయడానికి ఆయన తనకు తెలిసిన వ్యక్తిత్వ వికాసం అంశాలను అమ్ముల పొదిలోంచి బయటకు తీస్తున్నారు.మన పార్టీకి ప్రజల్లో ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. కొన్నిచోట్ల వచ్చిన ఫలితాలను చూసి బెదిరిపోవాల్సిన అవసరం లేదు. మన మన్నన మనకు చాలా స్థిరంగా ప్రజల్లో ఉన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. మన మీద నమ్మకం ఉన్న ప్రజల్లో అది పెంచడానికి, వారిద్వారా ఇతరుల్లో వ్యాప్తిచెందించడానికి ప్రయత్నించాలి.. అనే ధోరణిలోనే ఆయన శ్రేణులను సిద్ధం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English