వారికి ఎందుకు అర్థం కాదు..

వారికి ఎందుకు అర్థం కాదు..

తెలిసి మాట్లాడతారో.. తెలీక మాట్లాడతారో అర్థం కాదు. అలా అని మాట్లాడే వాళ్లేమన్నా ఎల్ కేజీ పిల్లలా అంటే అదీ కాదు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మిగిలిన వారికి వాళ్లకీ ఓ తేడా ఉంటుంది. అందరి కంటే కూడా గుండెధైర్యం కూడా ఎక్కువే. ఎందుకంటే.. ఆ పార్టీ అధినేతతో సహా ఆయన కుటుంబంలోని వారికి చురుకుదనం ఎక్కువ. తేడా వస్తే.. మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెబుతారు. ఇక్కడ జగన్ అన్న దుందుడుకు తనం ఇప్పటివరకూ పబ్లిక్ గా ఫోకస్ కాలేదనుకోండి. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నా.. ఆ పార్టీ లీడర్లు అన్న భయంతో కూడిన భక్తి అందరిలోనూ ఉంటుంది.

ఆ విషయాన్ని పక్కన పెట్టి... అవిశ్వాస తీర్మానంపై ఆ పార్టీ చేస్తున్న రచ్చ లోకి వద్దాం. వైకాపాలోని ఎమ్మెల్యేలు.. అందరులోనూ సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాంటివాళ్లకు అసెంబ్లీ నిబంధనలు తెలియకుండా ఉంటాయా? సభ సంప్రదాయం గురించి అవగాహన లేకుండా ఉంటుందా? కానీ.. అన్నీ తెలిసినా తెలీనట్లు మహా గడుసుగా మాట్లాడుతుంటారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో... చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైఎస్సార్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ శాసనసభా పక్షం( అంటే.. ఆ పార్టీలోని ఎమ్మెల్యేలంతా కలిపిన సమూహం అన్న మాట) అయితే చంద్రబాబుకు ఒక లేఖ రాసేసింది. మీరు అవిశ్వాస తీర్మానం పెట్టకుండా కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని. కానీ... ఒక సమావేశ కాలంలో (ఇప్పుడు జరుగుతున్నవి బడ్జెట్ సమావేశాలు) ఒకసారి మాత్రమే.. అవిశ్వాస తీర్మానం పెట్టే వీలు ఉంటుంది. ఇది సంప్రదాయం కూడా. ఇప్పటికే మార్చిలో జరిగిన సమావేశాల (అవి కూడా బడ్జెట్ సమావేశాలు. అప్పుడు వాయిదా పడి.. మళ్లీ కాస్త గ్యాప్ తర్వాత మొదలయ్యాయి) సమయంలో ఒకసారి అవిశ్వాస తీర్మానం పెట్టారు. అవకాశం లేదురా నాయనా అని చాలామంది మొత్తుకుంటున్నా... వాళ్లు మాత్రం వినిపించుకోరు. ఓ సీనియర్ జర్నలిస్టు ఇదేవిషయాన్ని ఓ సీనియర్ ఎమ్మెల్యే దగ్గర ప్రస్తావిస్తే... ముసిముసిగా నవ్వి... ఆ విషయం మాకూ తెలుసండి. కాకపోతే... అలా మాట్లాడితేనే కదా.. బాబు కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారని ప్రజలు అనుకునేదంటూ అసలు విషయం చెప్పేశారట. అంతేలెండి... రాజకీయం నేర్వకుండానే రాజకీయ నాయకులు అవ్వరు కదా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English