అరుణాచలం వచ్చేస్తున్నాడు

అరుణాచలం వచ్చేస్తున్నాడు

కొత్త క్యారెక్టర్ రాష్ట్ర ప్రజలకు పరిచయం కానుంది. జేడీ లక్ష్మీనారాయణ బదిలీ అయి వెళ్లిపోతున్న నేపథ్యంలో ఆయన స్థానంలో వచ్చే అధికారి ఎవరై ఉంటారని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. జేడీ లక్ష్మీనారాయణ డీల్ చేసిన కేసులు అల్లాటప్పా కావు. జగన్, గాలి జనార్దన్ రెడ్డి లాంటి వారికి సంబంధించినవి. ఆయన స్థానంలో వచ్చే అధికారి ఎలా ఉంటాడు.. లక్ష్మీనారాయణ మాదిరే కరుకేనా లాంటి సందేహాలు చాలామందిలో ఉన్నాయి. అయితే... ఆయన స్థానంలో రానున్న అధికారి గురించి ఆరా తీసినప్పుడు ఆసక్తి కలిగించే అంశాలు వెలుగులోకి వచ్చాయి. లక్ష్మీనారాయణ స్థానంలో వచ్చే అధికారి పేరు అరుణాచలం. తమిళనాడుకు చెందిన వ్యక్తి. గతంలో పెరంబూరు జిల్లా ఎస్పీగా... విజిలెన్స్, అవినీతి నిరోధకశాఖ ఎస్పీగా పని చేసిన ఆయన నార్కోటిక్స్ విభాగంలో డీఐజీగా పదోన్నతి పొందారు. తమిళనాడు పోలీస్ అకాడమీలో డీఐజీ హోదాలో కూడా పని చేసిన ఆయన.. మూడేళ్ల క్రితం ఐజీగా పదోన్నతి పొందారు. అనంతరం డీఐజీ కార్యాలయంలోని హెడ్ క్వార్టర్స్ లో ఐజీగా బాధ్యతలు నిర్వహించారు. పది నెలల క్రితమే సీబీఐ జేడీగా విధులు చేపట్టారు.

చెన్నై జోన్ సీబీఐ జేడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన రాష్ట్రానికి రావటానికి ఒక వారం పైనే పట్టొచ్చని చెబుతున్నారు. నిజాయితీగా ఉండటం.. ముక్కుసూటిగా వ్యవహరించటం ఆయనకు అలవాటు. ఒత్తిళ్లకు ఏమాత్రం లొంగక.. ఎంతటి స్థాయి వాళ్లనైనా ముప్పతిప్పలు పెట్టే రకం. పెద్దవాళ్ల కేసుల్ని‘ప్రత్యేకంగా’ పట్టించుకొని.. వాటిని చివరికంటా చూడటం ఆయనకు అదో అలవాటు. ఒక్కమాటలో చెప్పాలంటే... జేడీ లక్ష్మీనారాయణకు తాత అని చెప్పొచ్చు. ఆయన డీల్ చేసే కేసులు ఎలా ఉంటాయనే దానికి మచ్చుకో ఉదాహరణగా చెప్పుకోవాలంటే... ఆ మధ్యన తమిళనాడులో విదేశాల నుంచి విలాసవంతమైన కార్లను కొందరు బడాబాబులు దిగుమతి చేసుకున్నారు. ఇందుకోసం జస్ట్... వంద కోట్ల రూపాయిలను పన్ను ఏగవేసినట్లు ఆయన గుర్తించి రంగంలోకి దిగారు. ఈ ఖరీదైన కార్లను దిగుమతి చేసుకున్నవారిలో... బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ (అదేనండి మొన్న ఐపీఎల్ లో అల్లుడిగారి లీలలకు మామగారు తెగ ఇబ్బంది పడ్డారు కదా. కాకపోతే.. ఈ కేసులో మామే నిందితుడు), డీఎంకే అధినేత కరుణానిధి మనమడు, స్టాలిన్ కుమారుడు ఉదయనిధి, స్టాలిన్ (చెన్నైలో ఈయనగారి హవా ఎలా ఉంటుందో అక్కడి వారిని అడిగితే కథలు, కథలుగా చెబుతారు), సీనీ ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు లిస్టలో ఉన్నారు.

ఈ కేసు విషయం మీదే.. శ్రీనివాసన్ కు చెందిన ఓ పదకొండు కార్లను సీబీఐ స్వాధీనం చేసుకుంది. అందులో మన అరుణాచలానిదే కీలకపాత్ర అని ప్రత్యేకంగా చెప్పాలా? మరో కేసు గురించి రీసెంట్ గా నెదర్లాండ్స్ వెళ్లారు. ఆయన ఇలా ఇండియాలో ల్యాండ్ కాగానే.. ఆంధ్రప్రదేశ్ కు ఎంట్రీ ఇస్తారన్నమాట. మొత్తానికి రాష్ట్రానికి గట్టి పిండమే రానుందనే చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English