ఇక ఏవీ అన్నదమ్ముల సమస్యలు కానేకావు

ఇక ఏవీ అన్నదమ్ముల సమస్యలు కానేకావు

తెలంగాణలో ఉండే వారిలో ఆంధ్రా వాళ్లు వేరని.. తెలంగాణ వేరంటూ వ్యవహరిస్తున్న తెలంగాణ సర్కారు పుణ్యమా అని ఇక రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అన్నీ సమస్యలపైనా అన్నదమ్ముల మాదిరి వ్యవహరించుకోవాలి.. ఇచ్చిపుచ్చుకోవాలన్న ధోరణికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏదో ఒకట్రెండు ఏళ్ల నుంచి మాత్రమే తెలంగాణకు వచ్చిన వారి విషయంలో తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించినా తప్పు పట్టలేం. కానీ.. ఏకంగా 1956 ముందు పుట్టి ఉండాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాదిస్తున్న తీరు నేపథ్యంలో.. నీళ్లు.. నిధుల విషయంలో ఎలాంటి రాజీ పడకూడన్న వాదన వినిపిస్తోంది.

ఏదైనా అవసరం వచ్చినప్పుడు.. విద్యుత్‌ అవసరాల సమయంలో అన్నదమ్ముల విషయంలో ఆ మాత్రం ఆదుకోలేరా అంటూ తెలంగాణ మంత్రులు వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఏదైనా  అవసరం పడినప్పుడు గుర్తుకు వచ్చే అన్నదమ్ముల బాంధవ్యం.. సమస్యల సుడిగుండంలో పొరుగురాష్ట్రం చిక్కుకున్నప్పుడు కానీ.. మిగిలిన సందర్భాల్లోనూ గుర్తుకు రాదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ లెక్కన రాజధాని లేకుండా.. విభజనలో ఆంధ్రప్రదేశ్‌ను ఏకాకిని చేసిన విభజన వ్యవహారంపై చట్టబద్ధంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని నిర్మాణానికి కనీసం రూ.1.40లక్షల కోట్లు అవసరమని.. ఇంతా చేస్తే.. అది హైదరాబాద్‌ నగరంలో ఐదో వంతు కూడా ఉండదని చెబుతున్న నేపథ్యంలో.. హైదరాబాద్‌ నగరాన్ని వదులుకొని దానిపై వచ్చే ఆదాయాన్ని భారీగా నష్టపోయిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడుగులేయాల్సి ఉందన్న అభిప్రాయాలు సోషల్‌ మీడియాలో వ్యక్తం కావటం విశేషం. వీటిల్లో సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నా.. తెంపరితనంతో వ్యవహరిస్తున్న తెలంగాణ ప్రభుత్వ వ్యవహారశైలిని నిగ్గతీయటమే కాదు.. దేశంలోని అన్నీరాష్ట్రాలకు ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్న భావన వ్యక్తమవుతోంది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు