20 కుటుంబాలకు శాపమైన స్కూల్‌ బస్సు

20 కుటుంబాలకు శాపమైన స్కూల్‌ బస్సు

నుజ్జు నుజ్జు అయిన బస్సు.. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు.. చెల్లాచెదురుగా మాంసపు ముద్దలుగా కనిపించిన చిన్నారుల్ని చూసిన వారి తల్లిదండ్రులే కాదు.. చూపురులు సైతం కళ్ల వెంట కన్నీరు ధారలుగా కారుతోంది.

చిన్నారుల్ని రెఢీ చేసి.. వారి బాక్సులు సర్ది.. వారికి మంచి చెడ్డలు చెప్పి.. స్కూల్‌ బస్సు ఎక్కించి.. భద్రం బిడ్డో అంటూ చెప్పటమేకాదు.. బస్సు డ్రైవర్‌కు కూడా బేటా జర.. నెమ్మదిగా పోనివ్వు. స్పీడ్‌ వద్దు. వెనకాముందు చూసుకో. కాలం బాలేదంటూ చెప్పి పది నిమిషాలు కూడా పూర్తి కాకముందే పిడుగులాంటి వార్త వారి చెవిని తాకింది. స్కూలు బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంతో 20 మంది మృత్యువాత పడగా.. మరో పది మంది విషమ పరిస్థితుల్లో ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

గురువారం ఉదయం మెదక్‌ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘోర దుర్ఘటన అందరినీ కదిలించివేస్తోంది. ఏడోతరగతి లోపు విద్యార్థులతో ఉన్న ఈ స్కూల్‌ బస్సును కాపలా లేని లెవల్‌ క్రాసింగ్‌ దాటుతున్న సమయంలో నాందేడ్‌.. సికింద్రాబాద్‌ రైలుబండి ఢీ కొట్టింది. కాపలా లేని లెవల్‌ క్రాసింగ్‌ వద్ద బస్సును తీసుకెళ్లే సమయంలో అత్యంత జాగ్రత్త వహించాల్సిఉంటుంది. కానీ.. తాజా ఘోర ఘటనలో మాత్రం అందుకు భిన్నంగా ఉండటంతో పదుల సంఖ్యలోని కుటుంబాల్లో తీరని శోకం చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ ఘటనాస్థలంలోనే మరణించాడు. క్లీనర్‌ కూడా మృత్యువాత పడ్డాడు.

మెదక్‌జిల్లా వెల్దుర్తి మండలం.. మూసాయిపేట వద్ద చోటు చేసుకున్న ఈ ఘోర దుర్ఘటన.. తుప్రాన్‌లోని కాకతీయ విద్యాలయానికి చెందిన బస్సు ఇస్లాపూర్‌ నుంచి మాదాపేట వైపు వెళ్తుండగా చోటు చేసుకుంది. డ్రైవర్‌ ఏ మాత్రం జాగ్రత్తగా ఉన్నా ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని చెబుతున్నారు. అదేసమయంలో ఈ లెవల్‌ క్రాసింగ్‌ వద్ద ఇప్పటికే చాలా ప్రమాదాలు చోటు చేసుకున్నాయని.. కాపలా గేటును ఏర్పాటు చేసి ఉంటే ఈ ఘోరం చోటు చేసుకునేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రైలు శబ్ధం స్పష్టం వినిపిస్తుందని.. అందులోకి ఆ మార్గంలో వెళ్లే వారికి తొమ్మిది గంటల ప్రాంతంలో దాదాపుగా నాలుగు రైళ్లు వస్తాయన్న విషయం కూడా తెలుసని స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్‌ అప్రమత్తంగా ఉండి ఉంటే.. ఈ ఘోరం జరిగి ఉండేది కాదు. కేవలం మానవ తప్పిదం కారణంగా అంతులేని శోకానికి పదుల సంఖ్యలో కుటుంబాలు గురి కావటం దురదృష్టకరమనే చెప్పాలి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు