శివసేన ఎంపీ చర్యను ఆ కోణంలోనే చూడాలా..?

శివసేన ఎంపీ చర్యను ఆ కోణంలోనే చూడాలా..?

ఇప్పుడు ఒక చిన్న విషయం దేశం మొత్తాన్ని ఉడికించేస్తుంది. ఈ అంశాన్ని మూడు ముక్కల్లో చెప్పాలంటే.. ఢిల్లీలోని న్యూ మహరాష్ట్ర సదన్‌ (ఢిల్లీలోని తెలుగువాళ్ల ఏపీ, తెలంగాణ భవన్‌ల మాదిరి)లో వడ్డిస్తున్న ఆహారం నాసిరకంగా ఉంటుందని.. శివసేనకు చెందిన ఒక ఎంపీ.. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగిని రోటీలను తినమంటూ బలవంతం చేశారు.

ఈ విషయాన్ని జాతీయఛానెళ్లు వార్తాకథనాల్ని ప్రసారం చేయటంతో తీవ్ర దుమారం చెలరేగింది. జరిగిన ఘటనకు వార్తా ఛానెళ్లు వినిపిస్తున్న వాదన ఏమిటంటే.. సదరు ఉద్యోగి ముస్లిం అని.. అతను రోజా (రంజాన్‌ మాసంలో నిర్వహించే ఉపవాసదీక్ష)లో ఉన్నాడని.. అలాంటి వ్యక్తి చేత శివసేన ఎంపీ బలవంతంగా తినిపించటాన్ని వార్తలుగా ప్రసారం చేశారు.

అవసరానికి మించిన మసాలా ఉండటంతో ఈ వార్త భావోద్వేగాల్ని సృష్టించింది. ఇక్కడ.. శివసేన ఎంపీ బాధ్యతారాహిత్యంతో వ్యవహరించారనుకుంటే.. మీడియా అంతకు మించిన బాధ్యతారాహిత్యంతో వ్యవహరించారనే చెప్పాలి. ఎందుకంటే.. సదరు ఎంపీ శివసేన కాబట్టి.. ఉద్యోగి ముస్లిం కావటంతో వార్త కాస్తా సంచలన వార్తగా మారింది.

ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఒక ఎంపీకి ఒక హోటల్‌లో పని చేసే ఉద్యోగి హిందువా? ముస్లిం అని తెలిసే అవకాశం ఉండదు. దానికి మీడియా చెబుతున్న సమాధానం.. సదరు ఉద్యోగి ఐడెంటిటీ కార్డు మీద పేరు స్పష్టంగా కనిపిసుతందని. అంటే.. కోపంతో ఉన్న వ్యక్తి అరిచే సమయంలో.. తాను అరుస్తున్నది హిందువు పైనా.. ముస్లింపైనా అని చెక్‌ చేసుకొని అరుస్తారా? ఒకవేళ సదరు ముస్లిం స్థానంలో ఒక హిందువు ఉన్నాడనుకుందాం? జాతీయఛానెళ్లకు అప్పుడు ఈ అంశం ఒక వార్తగానే కనిపించదేమో.

ఎంపీ దూకుడుతనాన్ని చెప్పాలనుకుంటే ఆ కోణంలో చెప్పటం బాగుంటుంది. అంతేకానీ.. ఒక దీక్షలో ఉన్న ముస్లింకు ఒక హిందూ (శివసేన) ఎంపీ బలవంతంగా రోటీ తినిపించటం? అంటూ వార్తా కథనాన్ని ప్రసారం చేయటమే అసలు సమస్య. ఇద్దరు వ్యక్తుల మధ్య విద్వేషపూరితం గొడవ జరగకపోయినా.. దానికి మతం రంగు పులమటం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. అలాంటి మీడియా సంస్థల మీద సైతం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ అంశంపై అధికార పక్షం కాకుండా.. విపక్షానికి చెందిన మాజీ కేంద్రమంత్రి గులాంనబీ అజాద్‌ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమైనవి. ఈ అంశాన్ని మతపరమైన కోణంలో చూడటం సరికాదన్న మాట అక్షర సత్యం. కానీ.. ఏదోవిధంగా కల్లోలం సృష్టించటానికి కొన్ని పార్టీలకు.. మరికొన్ని ఛానెళ్లు తోడు కావటమే దురదృష్టకరమైన అంశంగానే భావించాలి. ఈ ధోరణి ఏ మాత్రం మంచిది కాదన్నది గుర్తించాలి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు