పిల్లల ఆకలిని 'అమ్మ' తీర్చదా

పిల్లల ఆకలిని 'అమ్మ' తీర్చదా

స్థానికత వ్యవహారం ఇరు రాష్ట్రాల్లో అగ్గి పుట్టిస్తోంది. లోకల్‌.. నాన్‌లోకల్‌ ఇష్యూలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేస్తున్న అడుగులే ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వ్యవహారంలో 1956 ముందు తెలంగాణలో పుట్టిన వారి విద్యార్థులు మాత్రమే అర్హులని.. మిగిలిన వారు కాదని కేసీఆర్‌ తేల్చి చెప్పటమే తాజా వివాదానికి కారణం.

ఈ వివాదంపై అటు ఆంధ్ర ప్రాంత పౌరులతో పాటు.. తెలంగాణ ప్రాంతీయులు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు కారణాలు రెండున్నాయి. ఒకటి.. 1956కు ముందు తెలంగాణ ప్రాంతంలో పుట్టి ఉండటం అన్నది వినేందుకు బాగానే ఉన్నా ఆచరణలో మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినా ఒక దేశంలో నివసించే ప్రజలకు సంబంధించిన స్థానికత (విద్య వరకూ)పై ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. వీటి కారణం వల్లే కొందరు విద్యార్థులు తీవ్ర అవస్థల పాలవుతుంటారు.

నాలుగేళ్లు ఒకే స్టేట్‌ పరిధిలో చదివితే వారు ఆ స్టేట్‌కి లోకల్‌ అని.. మిగిలిన వారు కాదన్నది ఇప్పటివరకూ ఉన్న నిబంధన. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుంటారు. కేవలం పిల్లల చదువుల కోసం వారికి ఒకచోట ఉంచి.. తల్లిదండ్రులు వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే వారు చాలామందే ఉంటారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఒకవైపు ఉంటే.. ఇక.. 1956 కటాఫ్‌ చేస్తే చాలామంది తెలంగాణ ప్రాంతం వారు సైతం అనర్హులుగా మిగిలిపోయే అవకాశం ఉండదు.

ఫీజు చెల్లింపు విధానం కారణంగా పేద విద్యార్థులు చదువుకునేందుకు.. నాణ్యమైన విద్యను పొందే వీలు ఉంటుంది. అలా అని ఆ కార్యక్రమంలో లోటుపాట్లు లేవా అంటే ఉన్నాయనే చెప్పాలి. కానీ.. ఎక్కువమందికి మంచి జరిగే పథకాన్ని కొనసాగించటంతోపాటు.. లోటుపాట్లు పూడ్చేందుకు ప్రయత్నించాలేకానీ.. కక్షతో వ్యవహరించటం మంచిది కాదు.

ఆంధ్రుల పిల్లలకు మేం ఫీజు ఎందుక కట్టాలని అడిగే తెలంగాణ సర్కారు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. తెలంగాణ సాధనలో ఆంధ్రా ప్రాంతం వారు కూడా గళం విప్పారు. కొంతమంది సపోర్ట్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవసరమైన సహాయ సహకారాలు.. ఈ రోజు అధికారంలోకి వచ్చాక మాత్రం అవసరం లేకుండా పోతాయా?

ఒక తల్లిగా పిల్లలు ఎవరూ ఆకలితో అలమటిస్తున్నా చూస్తూ ఊరుకోదు. తనకు చేతనైనంత సాయం చేసి వారి ఆకలిని తీర్చే ప్రయత్నం చేస్తుంటుంది. అదే మాదిరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్‌.. తన ప్రాంతంలో నివసించే వారు (ఏ ప్రాంతానికి చెందిన వారైనా) ఎవరైనా ఆయన పాలకుడే అన్న విషయాన్ని మర్చిపోకూడదు.

తెలంగాణలో బతికే ఆంధ్రోళ్లకు ఏపీ ముఖ్యమంత్రి.. తెలంగాణ ప్రాంతంలో బతికే గుజరాతీయులకు గుజరాత్‌ ప్రభుత్వం.. మహరాష్ట్రీయులకు మహరాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవాలనటం ఎంత ఛండాలంగా ఉంటుందో.. స్థానికత మీద తెలంగాణ ప్రభుత్వ వాదన అలానే ఉంది. ఒక ప్రాంతంలో నివసించే వారి సంక్షేమం.. రక్షణ.. అన్నీ అంశాలు ఆయాన ప్రభుత్వాలే బాధ్యత వహించాలే తప్ప.. అది తమ పని కాదన్నట్లు వ్యవహరించటం ఏ మాత్రం క్షేమకరం కాదన్న విషయం మర్చిపోకూడదు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తన రాష్ట్రంలో నివసించే అందరి ప్రజల సంక్షేమంపై దృష్టి సారించేలా తప్ప కొందరికి మాత్రమే అనటం ఏ మాత్రం సరికాదు. అదే జరిగితే.. అమ్మ పాత్ర నుంచి సవితి తల్లి పాత్రలోకి మారినట్లుగా భావించాల్సి ఉంటుంది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు