జగన్‌పై ముప్పేట దాడి!

జగన్‌పై ముప్పేట దాడి!

తెలుగుదేశం పార్టీ నేతలంతా ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డిపై ముప్పేట దాడి మొదలుపెట్టారు. అటు చంద్రబాబు నుంచి మొదలు మంత్రులంతా విలేకరుల సమావేశాలు పెట్టి మరీ విరుచుకుపడుతున్నారు. వాస్తవానికి, చంద్రబాబు రుణమాఫీని ప్రకటించాడు. అయినా జగన్‌ మాట్లాడడం లేదు. చంద్రబాబు ప్రకటించిన రుణ మాఫీ పథకాన్ని చూసి జగన్‌కు మాట పడిపోయిందని విమర్శించింది టీడీపీ నేతలే. తీరా, రుణ మాఫీ పథకంలో లొసుగులను ప్రస్తావిస్తూ జగన్‌ విమర్శించగానే ఆయనపై ధ్వజమెత్తుతున్నది కూడా టీడీపీ నేతలే.

ఎన్నికల ప్రచారంలో భాగంగా వ్యవసాయ రుణాలు అన్నిటినీ మాఫీ చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలంతా ప్రకటించారు. విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటికీ కరపత్రాలు వేశారు. ఈనాడు పత్రికలో ప్రకటనలు ఇచ్చారు. ఒక్కొక్క ఇంటికి ఎంత రుణం మాఫీ అవుతుందని ప్రచారం చేసిన మాట కూడా నూటికి నూరు శాతం నిజం. కానీ, ఇప్పుడు ఆర్థిక కష్టాల పేరిట కేవలం మూడో వంతు రుణాలనే మాఫీ చేస్తున్నారు. 96 శాతం మందికి లబ్ధి చేకూరుస్తున్నామని చెబుతున్నా అదంతా బోగస్‌ అనే అభిప్రాయాలు చాలామందిలో నెలకొన్నాయి. అలాగే,  ఎస్క్రో ఖాతా పేరిట మరో రెండు మూడు నెలలు వాయిదా వేసే వ్యూహం  కూడా టీడీపీ  చేస్తోందన్న విమర్శలు లేకపోలేదు.

ఎర్ర చందనం విక్రయించి రుణ మాఫీ చేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నా అందుకు అనుమతి ఇవ్వడం అంత సులభం కాదన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాలనే జగన్‌ తన విలేకరుల సమావేశంలో ప్రస్తావించారు. కానీ, టీడీపీ నేతలు మాత్రం జగన్‌పై ముప్పేట దాడికి దిగారు. అది కూడా ఎంతగా అంటే.. రుణ మాఫీపై మరో ప్రతిపక్ష నేత మాట్లాడడానికి వీల్లేకుండా ఎదురుదాడి చేస్తున్నారు. జగన్‌కు ఏమాత్రం అనుభవం లేదని.. చంద్రబాబు అనుభవం అంత వయసు జగన్‌కు లేదని పత్తిపాటి పుల్లారావు అంటే.. రైతులను ఆదుకోవడానికే రుణ మాఫీ అని, వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రుణమాఫీపై చంద్రబాబు నిర్ణయం సాహసోపేతమని మంత్రి దేవినేని ఉమా కొనియాడారు. మొత్తంమీద రైతు బంధు అవార్డును వైఎస్‌ నుంచి లాక్కుని చంద్రబాబుకు కట్టబెట్టే వరకూ టీడీపీ నేతలు నిద్రపోయేలా కనిపించడం లేదు.

ఇప్పుడు జగన్‌ ఆందోళనలకు పిలుపు ఇచ్చాడు కనక దానికి ఆదరణ లభిస్తే దానిపైరైతుల్లో ఇంకా అసంతృప్తి ఉన్నట్లు. కేవలం వైసీపీ శ్రేణులే ఆందోళనల్లో పాల్గొంటే చంద్రబాబు విజయం సాధించినట్లు. చూద్దాం.. ఏం జరుగుతుందో!!

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు