పోలవరం ప్రాధాన్యానికి ప్రత్యక్ష నిదర్శన

పోలవరం ప్రాధాన్యానికి ప్రత్యక్ష నిదర్శన

పోలవరం ప్రాజెక్టును అత్యవసరంగా ఎందుకు నిర్మించాలి? ఈ ప్రాజెక్టుతో ఉన్న ప్రయోజనం ఎంత? ఈ ప్రశ్నలకు తాజా పరిణామాలే ప్రత్యక్ష నిదర్శనాలు.

ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాభావం పట్టిపీడిస్తోంది. ఏవో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు కురుస్తున్నాయి. ఆ కొన్ని ప్రాంతాల్లో మహారాష్ట్ర కూడా ఉంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పుడు గోదావరి పరవళ్లు తొక్కుతోంది. గోదావరి డెల్టాలోనే చాలా ప్రాంతాల్లో ఇంకా నాట్లు ప్రారంభం కాలేదు. కానీ, గోదావరి నుంచి లక్షా 20 వేల క్యూసెక్కుల నీటిని వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సి వచ్చింది. అదే పోలవరం ప్రాజెక్టు ఉండి ఉంటే ఈ పరిస్థితి ఉండదు కదా.

పోలవరం ప్రాజెక్టును కట్టి ఉంటే రిజర్వాయర్లోనే నీటిని నిల్వ చేసి ఉండేవారు. ఆ నీటిని అటు ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా జిల్లాకు కూడా సాగుకు సరఫరా చేసేవారు. ఒకవేళ కృష్ణా పరీవాహక ప్రాంతంలో నీటికి కొరత వస్తే హైదరాబాదుకూ సరఫరా చేసే వీలు కల్పిస్తున్నారు. అంతేనా.. రాయలసీమకూ గోదావరి నీటిని సరఫరా చేస్తారు. ఏటా గోదావరి నుంచి దాదాపు 200 టీఎంసీల నీళ్లను వృథాగా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఒక్క టీఎంసీతో పది వేల ఎకరాలకు నీటిని అందించవచ్చని ఒక  అంచనా. దానినిబట్టి 200 టీఎంసీలతో 20 లక్షల ఎకరాలకు నీటిని అందించవచ్చన్నమాట. అంతనీరు అటు కోస్తాంధ్ర, రాయలసీమలతోపాటు తెలంగాణ జిల్లాలకు పనికిరాకుండా వృథాగా పోతోంది.

ఇక, పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తే ఎన్నో గ్రామాలు మునిగిపోతాయని, గిరిజనులు తమ సంస్కృతిని కోల్పోతారని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. గోదావరి రాష్ట్రంలోకి కేవలం మంగళవారమే ప్రవేశించింది. ఆరోజు ఖమ్మం జిల్లా భద్రాచలంలో నీటి మట్టం కేవలం 22.6 అడుగులు. ఇది చాలా తక్కువ కింద లెక్క. ఆ మాత్రానికే వాజేడు మండలంలోని కొన్ని గ్రామాలు మునిగిపోయాయి. పాతిక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఇక, వర్షాలు మరింతగా కురిస్తే భద్రాచలం వద్ద నీటిమట్టం 50 అడుగులకు చేరుకుంటుంది. అప్పుడు భద్రాచలం కూడా నీట మునుగుతుంది. ఇది ఎన్నో సందర్భాల్లో మనం కళ్లారా చూశాం. దీనర్థం.. అక్కడి గ్రామాలన్నీ నిరంతరం ముంపులోనే ఉంటాయి. అటువంటప్పుడు ఆయా గ్రామాలకు ప్రమాదం ముంచుకుని వచ్చే వరకు వేచి ఉండకుండా ముందుగానే పునరావాసం కల్పిస్తే మంచిది కదా. ఎప్పుడూ ముంపుల ఉండే గ్రామాల గురించి ఇంతగా ఆందోళన చెందడం అంత అవసరమా? గోదావరి నీటిని ఒడిసిపట్టుకుంటే అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు మధ్యలోని కోస్తాంధ్రకు అంతగా అవసరమైతే హైదరాబాద్‌కు కూడా మేలు జరుగుతుంది. ఇటువంటి ప్రాజెక్టును ఆహ్వానించాల్సిందిపోయి అడ్డుకోవడం అవసరమా?

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు