నాన్న భూముల్ని అమ్మేసాడు జగన్‌బాబు

నాన్న భూముల్ని అమ్మేసాడు జగన్‌బాబు

జగన్‌బాబు ప్రెస్‌మీట్‌ పెట్టేశాడు. కడుపులో దాచుకున్న ఆవేదనను తీర్చేసుకున్నారు. వామ్మో.. వామ్మో.. ఎంత అన్యాయం.. ఎన్నికలప్పుడు చంద్రబాబు చెప్పిందేమిటి? చేసిందేమిటి? రుణమాఫీ చేస్తానని చెప్పి.. ఇప్పుడు రూ.1.5లక్షలు మాత్రమే రుణమాఫీ చేస్తాడా? ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉందా? అందుకు మూడు రోజుల పాటు ఏపీలోని ప్రతి గ్రామంలో నరకాసుని వధ కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రస్తావించిన అంశాల్లో కీలకమైనది అడవుల్లో చెట్టు తాకట్టు పెట్టి రైతుల రుణమాఫీ తీరుస్తారా? అంటూ ఆయన ప్రశ్నించారు. ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉందా? అని ఆవేశంగా అడిగేశారు.

నిజమే.. జగన్‌బాబు నిలదీయటంలో అర్థం ఉంది. చంద్రబాబు నాయుడుకు ఏం హక్కు ఉందని.. అడవుల్లో చెట్లు మొదలుకొని.. ఐరన్‌ఓర్‌ మీద కన్నేస్తాడా? మా నాన్న మాదిరి మరో గాలిని వెతికి పెట్టి అలాంటి విలువైన సంపదను దోచి పెట్టాలే కానీ.. చట్టబద్ధంగా అమ్మకాలు.. లీజుకు ఇవ్వటం ఏంటి ఛండాలంగా? అని ప్రశ్నించటం మాత్రమే మిగిలి ఉందనాలి.

2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడున్నంత దారుణంగా ఏమీ లేదు. వాస్తవానికి ఆదాయం కూడా మెరుగ్గా ఉంది. కానీ.. నెలవారీగా భూముల్ని అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన విషయం జగన్‌ మర్చిపోయినట్లున్నారు. ఆయనకు అలాంటి విషయాలు గుర్తు ఉండాల్సిన అవసరమేమీ లేదు. ఎందుకంటే.. ఆ టైంలో జగన్‌బాబు వ్యాపారాల మీద ఫుల్‌ బిజీగా ఉన్నారు కాబట్టి అలాంటి విషయాలేమీ గుర్తు ఉండవు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చటం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ విధి. ఉచిత విద్యుత్‌ కోసం కావొచ్చు.. మరో కారణం కోసం కావొచ్చు కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టేస్తుంటారు. అంత దాకా ఎందుకు లక్షల కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టిన జలయజ్ఞం విషయాన్నే తీసుకుందాం. అన్ని కోట్ల రూపాయిల్ని ఖర్చు పెట్టినా రైతులకు ఒరిగిందేమైనా ఉందా?

ఇలాంటి ప్రశ్నలకు జగన్‌బాబుకు సమాధానం చెప్పరు. ఇక.. ఎన్నికల సందర్భంగా బాబు ఇచ్చిన హామీల్ని ఇంకా అమలు చేయలేదంటూ విరుచుకుపడుతున్నారు. బాబు ఏపీకి ముఖ్యమంత్రి అయి రెండు నెలలు కాలేదు. కానీ.. అప్పుడే ఆయన అన్నీ హామీల్ని తీర్చేయాలని జగన్‌బాబు కోరుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతోకొంత వెసులుబాటు ఉంటుంది కానీ.. విభజన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఎన్నికల హామీల్ని నిలబెట్టుకోవటం అంత చిన్న విషయం ఏమీ కాదు.

నిజానికి ప్రాక్టికల్‌ ప్రాబ్లమ్స్‌ జగన్‌కు తెలియక కాదు. కాకపోతే.. అవన్నీ ఒప్పుకుంటే బాబును ఘనంగా కీర్తించాల్సి ఉంటుంది. అప్పుడు నరకాసుని వధ అంటూ కార్యక్రమాలు నిర్వహించే వీలు ఉండదు. అందుకే నాన్న హయాంలో జరిగిన విషయాలన్నీ మర్చిపోయిన జగన్‌బాబు చిన్నపిల్లాడి మాదిరి బాబు హయాంలో ఎంత అన్యాయం జరిగిందో అంటూ రంకెలు వేస్తున్నారు. నాన్నకు ఒక న్యాయం.. బాబుకు ఒక న్యాయం అనకుండా ఉంటేనే జగన్‌ను అనుమానించాలి కానీ.. ఇప్పుడైతే కాదనే చెప్పాలి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు