‘అర్థసత్య’ డైలాగులు ఆదుకోవు!

‘అర్థసత్య’ డైలాగులు ఆదుకోవు!

ధర్మరాజు ఆడితప్పని వాడని పేరు. ‘అశ్వత్థామ హత:’ అంటే అబద్ధం కాదు. ఎందుకంటే అదే పేరుతో ఒక ఏనుగు అదే యుద్ధరంగంలో ఉంది. అది అప్పుడే చనిపోయింది. ధర్మజుడి మాట విని కొడుకు చనిపోయాడేమో అనుకుని ద్రోణుడు నిశ్చేష్టుడయ్యాడు. అదే అదనుగా అతనిని సంహరించారు. ఈలోగా ధర్మజుడు తనలో సంశయం కూడా మిగలకుండా ‘కుంజర:’ అనే మాటను నెమ్మదిగా పలికి.. ‘తను అబద్ధం చెప్పలేదులే..’ అనుకుంటూ తీయగా ఆత్మవంచన చేసుకున్నాడు. దీనినే మనం ‘అర్థసత్యం’ అంటూ ఉంటాం.

జగన్‌ తాలూకు అక్రమార్జనల కేసుల్లో పాత్రధారులుగా పీకల్దాకా కూరుకుపోయి... ప్రస్తుతం ప్రాసిక్యూషన్‌కు వీలుగా పదవులకు రాజీనామాలు సమర్పించిన మాజీ మంత్రులు.. ఇదే తరహాలో అర్థసత్యాలు పలికితే.. అసలు వివాదం నుంచి బయటపడిపోతాం లెమ్మని కలలు కంటున్నారు. మహాభారత కాలంనుంచి మన దేశంలో జరుగుతున్నది అదే కదా.. అదే సాంప్రదాయాన్ని మనం కూడా పాటిస్తే చాలునని అనుకుంటూ ఉన్నారు. అయితే అదంతా కల్లమాట. ఇప్పుడు కలియుగం నడుస్తోంది. అర్థసత్యాలు పలికి వారు కేసుల్లోంచి బయటపడడం జరగని పని.
ఇప్పుడు రాజీనామా చేసిన మంత్రులు అటు ధర్మాన ప్రసాదరావు గానీ, ఇటు సబితా ఇంద్రారెడ్డి గానీ.. తాము మంత్రి వర్గ నిర్ణయాలను అమలు చేశామే తప్ప.. వ్యక్తిగతంగా తాము పొందిన లబ్ధి అంటూ ఏమీ లేదని.. తాము వ్యక్తిగతంగా ఎలాంటి క్విడ్‌ప్రోకోకు పాల్పడలేదని.. సమస్తం రూల్‌ బుక్‌ ప్రకారమే జరిగిందని, బిజినెస్‌ రూల్స్‌కు విరుద్ధంగా ఏమీ చేయలేదని.. ఇలాంటి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తాము పలుకుతున్న అలాంటి అర్థసత్యాల ద్వారా.. ‘‘తాము కేవలం సంతకాలు చేశామే తప్ప.. పాపం తమది కాదని.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒత్తిడి లేదా సూచన మేరకు తాము ముందు వెనుక చూసుకోకుండా జీవోలు జారీ చేసేశాం ’’ అని ప్రజలు లేదా దర్యాప్తు సంస్థలు లేదా న్యాయస్థానాలు అర్థం చేసుకోవాలని వారు భావిస్తున్నారు.

ఈ రోజుల్లో ఇలాంటి పప్పులు ఉడకవు. చట్టం ఎదట నిలబడాల్సి వచ్చినప్పుడు.. ‘అలా అనుకోండి’ అని అంటే కుదర్దు. కనీసం తమ చేతుల మీదుగా జరిగిన ఈ పాపం వెనుక వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒత్తిడి ఉన్నదనే సంగతి వారు స్పష్టంగా చెప్పాలి. అలా చెప్పగల తెగువ లేకుండా.. చెబితే ఏం అవుతుందో ఏమో.. రేప్పొద్దున ఎవరు అధికారంలోకి వస్తారో.. అప్పుడు ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో.. మనకెందుకు వచ్చిన గొడవలెద్దూ.. అనుకుంటూ ఉంటే గనుక.. కోర్టు ఎలాంటి శిక్ష విధిస్తే దాన్ని భరించడానికి సిద్ధంగా ఉండాలి. అంతే తప్ప.. అర్థసత్యాలతో పూర్తిగా విముక్తి పొందుతామని.. ఆశిస్తే వారికి భంగపాటు తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English