ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌షిప్‌ రూ1.30కోట్లకు దెబ్బేసింది

ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌షిప్‌ రూ1.30కోట్లకు దెబ్బేసింది

ఆన్‌లైన్‌ స్నేహాలు ఎంత ఖరీదైనవో.. మంచి కంటే మోసానికి ఎంత అవకాశం ఉంటుందోనన్న విషయం చెప్పే ఉదంతమింది. ఏ మాత్రం విశ్వసనీయత లేని ఆన్‌లైన్‌ స్నేహాలు ఎంత దారుణంగా మోసం చేస్తారో తాజాగా మరోసారి రుజువైంది.

డెహ్రాడూన్‌లో నివసించే బీనా (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి సతీమణి)కు ఫేస్‌బుక్‌లో రిచర్డ్‌ ఆండర్సన్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వారి మధ్య స్నేహం అనతి కాలంలో ఎఫ్‌బీని దాటి.. ఫోన్‌ ఛాటింగ్‌ వరకూ వెళ్లింది.

ఈ సందర్భంగా తనకు సేవాకార్యక్రమాలు అంటే ఇష్టమని.. ఇండియాలో భారీగా సేవాకార్యక్రమాలు చేపట్టాలని.. అందుకోసం రూ.9కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్దమవుతున్నానని బిస్కెట్‌ వేశాడు. దీనికి బీనా అడ్డంగా దొరికిపోయారు.

సేవా కార్యక్రమాల కోసం తాను రూ.9కోట్లు పంపుతున్నట్లు చెప్పిన రిచర్డ్‌ కు తగ్గట్లే.. బీనాకు ఓ ఫోన్‌కాల్‌ వచ్చింది. అందులో వ్యక్తి తనను తాను పరిచయం చేసుకుంటూ తాను ఆర్‌బీఐ ఫారిన్‌ ఎక్సైంజ్‌ అధికారినని.. బీనా కొంత పన్ను కడితే రూ.9కోట్లు తీసుకోవచ్చని చెప్పారు. అందుకోసం రూ.1.30కోట్ల మొత్తాన్ని 25 అకౌంట్లకు పంపాలని కోరారు.

ఈ మాటల్ని అమాయకంగా నమ్మేసిన బీనా.. వచ్చే రూ.9కోట్లకు పెట్టుబడిగా పెట్టే రూ.1.30కోట్లు పెద్ద లెక్కలోకి రావనుకున్నారో ఏమో కానీ.. మొత్తం డబ్బును ఆన్‌లైన్‌ ద్వారా పాతికఅకౌంట్లలో జమ చేశారు. తీరా చేతిలో ఉన్న డబ్బు పోయిందే కానీ.. రావాల్సిన సొమ్ములు మాత్రం రాలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బీనా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై ఆరా తీసిన పోలీసులకు.. సదరు మొత్తం కేరళ.. కర్ణాటక.. తమిళనాడులలోని పలు బ్యాంకుల్లో జమ అయినట్లు గ్రహించారు. మరి..దీని సూత్రధారిని పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారో ఏమో.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు