అడ్డంగా బుక్కయిన కవిత

అడ్డంగా బుక్కయిన కవిత

కేసీఆర్‌ కూతురు, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అనవసర వ్యాఖ్యలతో అడ్డంగా బుక్కయింది. తనకు మాలిన విషయాల్లో వేలు పెట్టి.. దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు గురవుతోంది. తెలంగాణ, ఆంధ్రకు సంబంధించి ఎన్ని మాటలన్నా చెల్లిపోయింది కానీ.. దేశ సమగ్రతకు సంబంధించి విషయాల్లో ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి దొరికిపోయింది కవిత.

ఇంతకీ విషయమేంటంటే.. తమకు తెలంగాణతో పాటు కాశ్మీర్‌ సమస్య కూడ ముఖ్యమేనంటూ.. తాము తెలంగాణ సరిహద్దు విషయంలో ఎలా పోరాడతామో, కాశ్మీర్‌ సరిహద్దు అంశం గురించి కూడా అలాగే పోరాడతామని చెప్పింది కవిత. అంతటితో ఊరుకోకుండా .. ''అందులో కొన్ని భాగాలు మనవి కావు. దాన్ని మనం అంగీకరించాలి. అంతర్జాతీయ సరిహద్దుల్ని తిరిగి లిఖించాలి'' అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసింది కవిత.

కాశ్మీర్‌ను ఇండియా ఆక్రమించుకుంది అన్న అర్థం వచ్చేలా.. ఓ పాకిస్థానీ తరహాలో కవిత చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. అన్ని పార్టీలూ ఈ వ్యాఖ్యల్ని ముక్తకంఠంతో ఖండించాయి. కాంగ్రెస్‌ వెంటనే కవితకు కౌంటర్‌ కూడా ఇచ్చింది. మిడిమిడి జ్ఞానంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించింది. కాశ్మీర్‌ వంద శాతం భారత్‌లో అంతర్భాగమని.. దాని గురించి దేశ ప్రజల్ని తప్పుదోవ పట్టించవద్దని కవితకు సూచించింది. అత్యంత వివాదాస్పదమైన విషయం గురించి అసందర్భ వ్యాఖ్యలు చేయడం ద్వారా కవిత లేనిపోని తలనొప్పులు తెచ్చుకున్నట్లయింది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు